మరోసారి హాట్ టాపిక్ గా మైనింగ్ కింగ్!
గతంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత అక్రమ మైనింగ్ వ్యవహారంలో 2011లో జైలు పాలయ్యారు
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక–ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఓబుళాపురం మైన్స్ మైనింVŠ ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పాపులర్ అయ్యారు.
గతంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత అక్రమ మైనింగ్ వ్యవహారంలో 2011లో జైలు పాలయ్యారు. దీంతో ఆయన తన ప్రాభవాన్ని కోల్పోయారు. బీజేపీ కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని గాలి జనార్దన్ రెడ్డి.. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి గతంలో తాను పోటీ చేసి గెలుపొందిన బళ్లారి సిటీ నుంచి తన భార్య గాలి అరుణను బరిలోకి దింపారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు.
గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి ఒక్కరే గెలుపొందారు. ఆయన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ తన మాతృ పార్టీ బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. మార్చి 25న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరుల సమక్షంలో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు.
ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఒకసారి గాలి జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి.శ్రీరాములుకు మద్దతుగా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తాను భేషరతుగా బీజేపీలో చేరుతున్నట్లు గాలి ఇప్పటికే ప్రకటించారు. ఆయన చేరికతో బళ్లారి, కొప్పళ, రాయచూరు, గదగ, హావేరి జిల్లాల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది.
బీజేపీలో చేరిక నేపథ్యంలో బెంగళూరులో తన పార్టీ నేతలు, కార్యకర్తలతో గాలి జనార్దన్ రెడ్డి తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరుతున్నట్టు వారికి తెలియజేశారు.