కీలక నేత చేరికపై పెదవి విరుస్తున్న కమలనాథులు!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో అయారాంలు.. గయారాంల సంస్కృతి నడుస్తోంది.

Update: 2024-08-29 08:23 GMT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో అయారాంలు.. గయారాంల సంస్కృతి నడుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నేతలు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. ఈ రెండు పార్టీల్లో అవకాశం దక్కనివారికి బీజేపీ ఆశాకిరణంగా కనిపిస్తోంది

ఈ క్రమంలో వైసీపీ నేత, వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కొల్లం గంగిరెడ్డి తన భార్యతో కలిసి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో విజయవాడలో ఆ పార్టీలో చేరతారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొల్లం గంగిరెడ్డి తన భార్యతో కలసి విజయవాడ చేరుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కొల్లం గంగిరెడ్డి చక్రం తిప్పారు. వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరుకు చెంది ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చింది. వైసీపీలో అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు నడిపిన గంగిరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయన అంతర్జాతీయ స్మగ్లర్‌ అనే అభియోగాలు నమోదయ్యాయి. ఆయనపై ఇప్పటికే పలు కేసులు కూడా దాఖలయ్యాయి.

కొద్ది రోజుల క్రితం మదనపల్లెలో ఒక సినిమా థియేటర్‌ కు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. తమ అధీనంలోనే ఉంచుకుని విచారించి వదిలేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసులను తప్పించుకోవడానికి గంగిరెడ్డి బీజేపీలో నిర్ణయించుకున్నారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. దేశభక్తుల పార్టీగా చెప్పుకుంటూ తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఏమిటని నిలదీస్తున్నారు. అతడు తనపై ఉన్న కేసుల భయంతోనే బీజేపీలోకి వస్తున్నాడని చెబుతున్నారు. అలాంటి వ్యక్తికి అండగా నిలవడం ఏమిటని మండిపడుతున్నారు.

అలిపిరి బాంబు బ్లాస్ట్‌ తోపాటు భూకబ్జాలు, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగిరెడ్డికి బెయిల్‌ లభించింది.

మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నట్టు గంగిరెడ్డి ధ్రువీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాలోని తన అనుచరులందరితో మాట్లాడి వారిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి చేరిక ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News