ట్రంప్ ప్రతీకార సుంకాలపై పలు దేశాధినేతలు ఆగ్రహం..మోడీ మాత్రం మౌనం

ప్రతీకార పన్నుల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై ప్రపంచ దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు.;

Update: 2025-04-03 05:17 GMT
Global Backlash Against Trump

ప్రతీకార పన్నుల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై ప్రపంచ దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేయటం గమనార్హం. ప్రతీకార సుంకాల ఎపిసోడ్ ను పరిశీలిస్తే.. పలు సందర్భాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని.. గొప్ప ఫ్రెండ్ అని చెబుతూనే భారత్ తీరును తప్పు పట్టటమే కాదు..భారత్ మీద 26 శాతం సుంకాన్ని విధించటం తెలిసిందే. ఇంత జరిగినా.. ఇప్పటివరకు ట్రంప్ ప్రతీకార సుంకం వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు స్పందించింది లేదు. ఆయన మౌనం ఇప్పుడు పలు ప్రశ్నలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

పలు దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలపై పలు దేశాధినేతలు స్పందించారు. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో అమ్ముకోవచ్చని.. అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని పేర్కొన్నారు. నిజమైన స్నేహితుడు ఇలా పని చేయడంటూ మండిపడ్డారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్. ఈ సుంకాలు తాము ఊహించలేదని.. నిజమైన స్నేహితుడి చేసే పని ఇది కాదన్నారు. ట్రంప్ టారిఫ్ చర్యలు అమెరికన్ ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

ఈయూ దిగుమతులపై సుంకాలు వేయటం ఏ మాత్రం సరికాదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్కొన్నారు. ఈ అంశంపై తాము అమెరికాతో ఒప్పందం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తాము వాణిజ్య యుద్ధాన్ని కోరుకోవటం లేదని.. యూఎస్ తో కలిసి టారిఫ్ లపై ఒక ఒప్పందం చేసుకుంటామని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ చెప్పారు. కెనడా ప్రధాని ట్రంప్ చర్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ట్రంప్ విధించిన భారీ సుంకాలకు వ్యతిరేకంగా పోరాడతామని.. ప్రతీకార సుంకాలు తాము విధిస్తామని ఆయన శపధం చేయటం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడి నిర్ణయం లక్షల్లోని కెనడియన్ల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. ట్రంప్ తీరుకు తగ్గట్లే.. జర్మనీ.. స్పెయిన్ తో సహా పలు దేశాలు తమ ప్రతీకార సుంకాల్ని ప్రకటించాయి. ట్రంప్ సుంకాల షాక్ ను తట్టుకోవటానికి వీలుగా బ్రెజిల్ సర్కారు ఏకంగా ఒక చట్టాన్నే తీసుకురావటం గమనార్హం. అయితే.. ఆ దేశ ప్రధాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ తన స్పందనను ఇప్పటివరకు తెలియజేయలేదు. ప్రతీకార సంుకాల ఎపిసోడ్ ను చూస్తే.. కీలకమైన ప్రతి సందర్భంలోనూ భారత్ ప్రస్తావన.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావిస్తూ.. భారత్ విధానాల్ని తప్పు పట్టటం తెలిసిందే. మరి.. ఇప్పటికైనా మోడీ స్పందిస్తారా? మౌనంగా ఉండిపోతారా?

Tags:    

Similar News