అక్కడ ఏవియేషన్ హబ్... అభివృద్ధి పరుగులే !

ఇదిలా ఉంటే జీవీఐఏఎల్ సంస్థ చెబుతున్నదేంటి అంటే కొత్తగా మరో అయిదు వందల ఎకరాల భూమిని తమకు అప్పగిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ ని డెవలప్ చేసి ఇస్తామని అంటోంది.

Update: 2025-01-12 04:10 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రాంతాల వారీగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుంటోంది. ఈ విషయంలో ఉత్తరాంధ్రాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధితో పాటు విమానయాన రంగంలోనూ అభివృద్ధి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీలో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు భోగాపురంలో రాబోతోంది. వచ్చే ఏడాది నాటికి తొలి దశ నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

మరో వైపు చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో కొత్తగా మరో అయిదు వందల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. భోగాపురంలో 2,703.26 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని నిర్మించాలని 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అ మేరకు శంకుస్థాపన కూడా చేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయిదు వందల ఎకరాలను తగ్గించేసింది. 2,203.26 ఎకరాలలోనే ఎయిర్ పోటు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి దానికి జగన్ సీఎం గా ఉండగా 2023లో మరోసారి శంకుస్థాపన చేశారు.

దాని ప్రకారమే నిర్మాణం జరుతుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో మళ్లీ గతంలో చేసిన డిజైన్ల ప్రకారం నిర్మాణం జరపాలని నిర్ణయం తీసుకుంది. దానితో పాటు ఈ ఎయిర్ పోర్టుని నిర్మిస్తున్న జీవీఐఏఎల్ సంస్థ పూర్తి స్థాయిలో ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయడానికి మరింత భూమి కావాలని కోరింది. దాంతొ ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది.

ఈ మేరకు మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల కమిటీలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మౌలిక వసతుల కల్పన శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీ కొత్తగా అయిదు వందల ఎకరాల భూమిని కేటాయించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనాల గురించి అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని అంటున్నారు. దాని ప్రకారం భూ సేకరణ చేపడతారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే జీవీఐఏఎల్ సంస్థ చెబుతున్నదేంటి అంటే కొత్తగా మరో అయిదు వందల ఎకరాల భూమిని తమకు అప్పగిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ ని డెవలప్ చేసి ఇస్తామని అంటోంది. ఇక భోగాపురంలోనే ఒక అతి పెద్ద టౌన్ షిప్ వస్తుందని శంషాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందడమే కాకుండా విశాఖతో అనుసంధానం అవుతుందని దాంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని బిజినెస్ పరంగా కూడా కొత్తగా మరిన్ని అవకాశాలు ఏర్పాడతాయని టోటల్ గా ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయని అంటున్నారు. దాంతో ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో పూర్తి ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News