చైనాలో భారీ భూకంపం.. ఎంత కష్టం వచ్చింది అంటే !
భవనాలుపెద్ద ఎత్తున కూలిపోవటంతో.. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు.
డ్రాగన్ దేశం తాజాగా చోటు చేసుకున్న భారీ భూకంపంతో చిగురుటాకులా వణికింది. భూకంప తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కావటమే కాదు.. భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 110 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవనాలుపెద్ద ఎత్తున కూలిపోవటంతో.. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు.
చైనాలోని వాయువ్య గన్స్.. కింగ్ హై ప్రావిన్స్ లో ఈ భారీ భూకంపం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 6.2గా నమోదైంది. చైనా కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత భూకంపం చోటు చేసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటం.. భవనాలు పేకమేడల్లా కూలిపోవటంతో ప్రాణ నష్టంఎక్కువగా ఉంది.
దీనికి తోడు అర్థరాత్రి దాటిన తర్వాత కావటంతో ఎక్కువ మందిప్రజలు గాఢ నిద్రలో ఉన్న వేళలో చోటు చేసుకున్న భూకంపాన్ని గుర్తించి.. స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగినట్లుగా చెప్పాలి. భూకంపం ధాటికి భవనాలు నేలకూలటం.. ప్రజలు భయాందోళనతో రోడ్ల వెంట పరుగులు తీశారు. చీకట్లో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విపత్తు నివారణ టీంలు రంగంలోకి దిగి బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
భూకంపం చోటు చేసుకున్న ప్రాంతంలో వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదు. విపరీతంగా మంచు కురవటం.. వాన కురుస్తున్న నేపథ్యంలో బాధితుల్ని గుర్తించేందుకు మొబైల్ టార్చి లైట్ల మధ్య వెతుకుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో.. చీకట్లో బాధితుల్ని గుర్తించటం కష్టంగా మారింది. దీనికి తోడు బాధితులకు సాయం చేసేందుకు వస్తున్న రెస్క్యుటీం వాహనాల్ని రోడ్ల మీద పేరుకుపోయిన మంచు ముందుకు వెళ్లనివ్వని పరిస్థితి. మరోవైపు భూకంప తీవ్రతను తెలియజేసే వీడియోల్ని పలువురు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.