ప్రజావాణికి భారీ స్పందన.. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు

వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు ప్రజాభవన్ కు తరలి రావటం కనిపించింది.

Update: 2023-12-15 09:23 GMT

మైలేజీ వస్తుందనుకున్న ఉదంతాల్లో అనూహ్యంగా షాకులు ఎదురవుతుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేపట్టిన ప్రజావాణికి అనూహ్య స్పందన వస్తోంది. ప్రతి మంగళవారం.. శుక్రవారాల్లో ప్రజాభవన్ వద్ద ప్రజల నుంచి నేరుగా వినతులు తీసుకుంటామని పేర్కొనటం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఒక మోస్తరు రద్దీగా ఉన్నప్పటికీ.. ఈ రోజు (శుక్రవారం) మాత్రం అందుకు భిన్నంగా భారీ స్పందన లభించింది. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు ప్రజాభవన్ కు తరలి రావటం కనిపించింది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికి ఉదయం 9 గంటకే ప్రజాభవన్ వద్దకు బారులు తీరారు. ఈ క్యూ దగ్గర దగ్గర పంజాగుట్ట వరకు ఉండటం గమనార్హం. భారీగా వచ్చిన అర్జీదారులతో ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో.. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. అర్జీదారుల్లో ఎక్కువమంది డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం.. పింఛన్ల కోసం.. దివ్యాంగులు.. భూ వివాదాలు.. ధరణి సమస్యలతో ఉన్న వారే ఎక్కువగా కనిపించారు.

అయితే.. ఈ ప్రజావాణి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ కు గుదిబండగా మారుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. పింఛన్లు.. ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆర్థిక సాయం లాంటి ఫర్లేదుకానీ.. భూ వివాదాలు.. ధరణి ఇష్యూలను పరిష్కరించటం ఆచరణలో సాధ్యం కాదంటున్నారు. దీని వల్లమొదటి రెండు నెలలు బాగా జరిగినా.. తమ వినతులకు ఎలాంటి స్పందన లేదన్న ఆగ్రహాం సామాన్యులకు వస్తుందని.. అదేజరిగితే మైలేజీ కాస్తా డ్యామేజీకి దారి తీస్తుందంటున్నారు.అందుకే.. ప్రజావాణి విషయంలోఅప్రమత్తంగా లేకుంటే మొదటికే మోసం రావటం ఖాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సో.. సీఎం రేవంత్ రెడ్డి బీకేర్ ఫుల్.

Tags:    

Similar News