డ్రగ్స్ తో దొరికిన ఐటీ ఉద్యోగి.. అసలు విషయం తెలిస్తే అవాక్కే

హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన 29 ఏళ్ల తేజస్ కట్ట ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడు. ఇతడి తల్లిదండ్రులు భారతీయులే.;

Update: 2025-04-06 07:30 GMT
డ్రగ్స్ తో దొరికిన ఐటీ ఉద్యోగి.. అసలు విషయం తెలిస్తే అవాక్కే

ఎంతో మంది కలలు కనే అమెరికా పౌరసత్వం అతడి సొంతం. చక్కటి ఐటీ ఉద్యోగం. అలాంటోడు చేసిన చెత్త పని గురించి తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. సమాజంలో డ్రగ్స్ ఎంత లోతుల్లోకి వెళ్లాయన్న ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ ను సరఫరా చేసే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తరలించే ఈ ఇద్దరిలో ఒకరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం.

హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన 29 ఏళ్ల తేజస్ కట్ట ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంటాడు. ఇతడి తల్లిదండ్రులు భారతీయులే. ఇతడు పుట్టిన ఏడాదికే ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిపోవటంతో అక్కడే చదువుకున్నాడు. అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. జాబ్ లో భాగంగా ముంబయికి వచ్చిన అతడు రెండేళ్లు పని చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక కంపెనీలో జాబ్ రావటంతో బేగంపేటలో ఉంటున్నాడు.

ఇతడు డ్రగ్స్ కు అలవాటు పడటంతో.. వాటికి సంబంధించిన వారితో పరిచయాలు పెంచుకున్నాడు. ఇందులో భాగంగా టోలిచౌకికి చెందిన 29 ఏళ్ల సోహైల్ అహ్మద్ తో పరిచయమైంది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కారులో ముంబయి వెళ్లి.. అక్కడ డ్రగ్స్ కొని హైదరాబాద్ కు తీసుకొచ్చి అమ్మే అలవాటు చేసుకున్నారు.

ఎప్పటిలానే కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కొనుగోలు కోసం ముంబయి వెళ్లి.. వస్తున్న వేళలో వీరికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న ఎక్సైజ్ పోలీసులు హైదర్షాకోట్ లోని సన్ సిటీ వద్ద తనిఖీలు చేపట్టి.. తేజస్.. సోహైల్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 32.5 గ్రాముల చెరస్.. 56 గ్రాముల ఎల్ ఎస్ డీ బ్లాట్లు.. 21 గ్రాముల ఓకుష్ గంజాయి.. రూ.లక్ష క్యాష్ ను.. కారును స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News