ఎటుచూసినా వరద.. హైడ్రా అవసరమేంటో ఇప్పుడు తెలుస్తోందా?

ఇక ఇళ్లలోకి నీరు చేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Update: 2024-09-02 10:50 GMT

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.. వరదలు చుట్టుముట్టేస్తున్నాయి.. నదులు.. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోయింది. విజయవాడ వంటి చోట్ల ప్రజలు బయటకు రావడమే కష్టం అయింది. ఇక ఇళ్లలోకి నీరు చేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ సేఫ్

వాస్తవానికి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఖమ్మం అయితే అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ లో అటవీ విస్తీర్ణం అధికంగా ఉండే మహబూబాబాద్ కూడా వరదలతో అల్లాడుతోంది. వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే, విచిత్రంగా హైదరాబాద్ కు వర్ష ప్రభావం పెద్దగా లేదు. నగరంలో వర్షాలు కురిసినా అన్ని ప్రాంతాల్లోనూ సమంగా లేదు. ఉదాహరణకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వర్షం ముంచెత్తినా.. ఖైరతాబాద్ కు వచ్చేసరికి అంత ప్రభావం లేదు. ఇక శివారు ప్రాంతాల్లోనూ వర్షం తీవ్రత తక్కువే.

ముంచెత్తితే.. ఆక్రమణలదే పాపం

హైదరాబాద్ లో నాలుగేళ్ల కిందట అక్టోబరు నెలలో భారీ వరదలు వచ్చాయి. దీంతో నగరం అతలాకుతలం అయింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అప్పా చెరువులో కొందరు ఆక్రమణలకు పాల్పడి.. షెడ్ లు అని చెప్పి ఏకంగా బిల్డింగ్ లే కట్టారు. దీంతో నీరు ఎటూ వెళ్లలేక జనావాసాలను ముంచెత్తింది. ఇక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక చెరువులు, నాలాల్లో ఇలాంటి ఆక్రమణలు ఎన్నెన్నో..? ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా రంగంలోకి దిగింది. ఫుల్ పవర్స్ తో, కమిషనర్ రంగనాథ్ సారథ్యంలో దూసుకెళ్తున్న హైడ్రా అక్రమార్కుల పనిపడుతోంది. చెరువుల శిఖం భూములు, బఫర్ జోన్ లలో నిర్మాణాలను కూల్చివేస్తోంది.

వరదలు హైదరాబాద్ లో వచ్చి ఉంటే...

నాలుగేళ్ల కిందటిలా హైదరాబాద్ లో వచ్చినట్లు కానీ.. ఖమ్మం, వరంగల్ లో ప్రస్తుత తరహాలో కానీ వరదలు హైదరాబాద్ లో వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమే. అసలే ఆక్రమణలతో కుంచించుకుపోయిన చెరువులు, నాలాలతో రాజధాని అల్లాడేది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత ఉండేదో చెప్పలేని పరిస్థితి. దీంతోనే ఇప్పుడు అందరూ హైడ్రా చర్యలను సమర్థిస్తున్నారు. ఈ ఏడాదిలో మరో నెల రోజుల వరకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అప్పటిలోగా హైడ్రా గనుక ఆక్రమణలు తొలగిస్తే ముప్పు తప్పుతుంది.

Tags:    

Similar News