వెనక్కి తగ్గిన హైడ్రా.. కారణాలు ఇవేనా..!

ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా ఎక్కడా తగ్గకుండా అక్రమ కట్టడాల భరతం పడుతూ సాగుతోంది.

Update: 2024-09-28 08:26 GMT

హైదరాబాద్, చుట్టు పక్కల ఏరియాల్లో ఇప్పుడు ఎవరినోట విన్నా హైడ్రా మాటనే వినిపిస్తోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా హైడ్రా గురించే చర్చిస్తున్నారు. ఎవరికీ లొంగకుండా దూసుకెళ్తున్న బుల్డోజర్లు, నేలమట్టం అవుతున్న కట్టడాలపై అంతటా చర్చ నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఏర్పాటైన హైడ్రా.. పురుడుపోసుకున్నప్పటి నుంచే తన ప్రతాపం చూపిస్తూ వస్తోంది. రాజకీయంగా ఎన్నో సంచనాలకు దారితీసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా ఎక్కడా తగ్గకుండా అక్రమ కట్టడాల భరతం పడుతూ సాగుతోంది.

చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి వెలిసిన అక్రమ కట్టాలను హైడ్రా గుర్తించి వాటిని నేలమట్టం చేస్తోంది. ఇప్పటివరకు వందలాది సంఖ్యలో కట్టడాలను నేలమట్టం చేయగా.. వంద ఎకరాలకు పైగా విలువైన భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. ఈ నెల మొదటి వారంలో హైడ్రా ఇచ్చిన నివేదిక ప్రకారం 23 ప్రాంతాల్లో 262 అనధికారిక కట్టడాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కట్‌చేస్తే.. ఇన్నాళ్లు దూకుడుగా వ్యవహరించిన హైడ్రా ఒక్కసారిగా వెనుకడుగు వేసిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైడ్రా కార్యకలాపాలకు చాలా వరకు మద్దతు తెలుపుతున్నా.. కొంత మంది పేదల నుంచి మాత్రం వ్యతిరేకత తప్పడం లేదు. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆస్తులు నేలమట్టం అవుతుండడంతో భరించలేకపోతున్నారు. రోదిస్తూ హైడ్రాపై శాపనార్థాలు పెడుతున్నారు. అధికారులను వదిలి పేదలను కష్టాల పాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనికితోడు నిన్న కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచమ్మ అనే మహిళ హైడ్రాకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దానిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఆయన చెప్పారు.

అయితే.. అటు మహిళ ఆత్మహత్య చేసుకోవడం.. ఇటు మూసీ పరిధిలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతుండడంతో హైడ్రా తన కార్యకలాపాలకు బ్రేక్ వేసినట్లుగా తెలుస్తోంది. అందులోభాగంగా ఇవ్వాళ్లి కూల్చివేతల కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు సమాచారం. మూసీ ప్రక్షాళన కోసం అక్కడి ఇళ్లను కూల్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను సైతం ఇస్తామని చెప్పింది. దాంతో అక్కడ కూల్చివేతల కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. అక్కడి బాధితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అటు సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులు సైతం వెనుతిరిగారు. ఇప్పటికే ఇళ్లకు మార్కింగ్ చేయగా.. ఆ మార్కింగ్‌లను బాధితులను తొలగించారు. ఈ క్రమంలో ఈ రోజుకు తాత్కాలికంగా బ్రేక్ నిచ్చిన హైడ్రా.. రేపటి నుంచి ఎలా ముందుకు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మూసీ బాధితుల నిరసనలు తట్టుకొని కూల్చివేతలు చేపడుతుందా..? మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్నే తాత్కాలికంగా వాయిదా వేస్తారా..? అనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కమిషనర్ రంగనాథ్ కలిసి చర్చిస్తారా..? లేదంటే ఇచ్చిన అధికారాలతో ముందుకు సాగుతారా అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.

Tags:    

Similar News