బాబు లోకేష్ జైల్లో ఉంటే .. కోఆర్డినేటర్ ఈయనేనా?
మిగిలిన విషయాలను పవన్ చెప్పినట్లుగా నాదెండ్ల ప్రతిపాదిస్తారు. చంద్రబాబు ఆలోచనల ప్రకారమే యనమల వ్యవహరిస్తారు.
జనసేన పార్టీతో సమన్వయం చేసుకునేందుకు టీడీపీ నుండి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బాధ్యతలు తీసుకోబోతున్నట్లు సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడును యనమల రెండు రోజుల క్రితం కలిసిన విషయం తెలిసిందే. తర్వాత టీడీపీ తరపున యనమల సమన్వయ బాధ్యతలు చూస్తారనే విషయం పార్టీలోని మిగిలిన సీనియర్లకు సంకేతాలు వెళ్ళాయట. అందుకనే యనమల కూడా సమన్వయ బాధ్యతల్లోకి దిగేశారు.
తొందరలోనే జనసేన తరపున సమన్వయ బాధ్యతలు చూస్తున్న నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. లోకేష్ ఢిల్లీ నుండి తిరిగి రాగానే యనమల ముందుగా భేటీ అవుతారు. వీళ్ళిద్దరి భేటీలో తీసుకున్న నిర్ణయాలనే నాదెండ్ల తో భేటీ సందర్భంగా చర్చించబోతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తంటే ప్రధానంగా సీట్ల షేరింగ్, పోటీచేయ నియోజకవర్గాలు ఏవి అనే పాయింట్లే అత్యంత కీలకంగా ఉంటాయి.
ఈ రెండు విషయాల్లోను చంద్రబాబు క్లియర్ గా ఉన్నట్లున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు చొరవతీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవు. అందుకనే ముందుగానే ఇదే విషయమై జైలులోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడేసినట్లున్నారు.
మిగిలిన విషయాలను పవన్ చెప్పినట్లుగా నాదెండ్ల ప్రతిపాదిస్తారు. చంద్రబాబు ఆలోచనల ప్రకారమే యనమల వ్యవహరిస్తారు. కాబట్టి యనమల-నాదెండ్ల భేటీలో పెద్దగా కీలక అంశాలపైన చర్చంటు ఉండకపోవచ్చు.
ఏదేమైనా వీళ్ళిద్దరు భేటీ అవటం ప్రాధాన్యత సంతరించుకోవటం ఖాయం. ఎందుకంటే పొత్తు అనంతర యాక్షన్ ప్లాన్ అమలు చేయటం అన్నది అత్యంత కీలకమైనది. చంద్రబాబు దిశానిర్దేశం ప్రకారమే చర్చలు జరిగినా సడెన్ డెవలప్మెంట్లు జరిగితే వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సుంటుంది.
కాబట్టే ఇటు పవన్ అటు లోకేష్ కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండక తప్పదు. ఈ నేపధ్యంలోనే ముందుగా చంద్రబాబు అరెస్టు, రిమాండుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ ఆందోళనలపై మాట్లాడుకునే అవకాశముంది. మరి ముందుముందు ఇంకేమి అంశాలపై చర్చించుకుంటారో చూడాలి.