.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

చంద్రబాబు రాజయోగం జగన్ పుణ్యమేనా?

విజయం చేతికి చిక్కిన తర్వాత.. దాన్ని తనతో పాటు ఉంచుకునేలా చేయటం అందరికి సాధ్యం కాదు.

Update: 2024-06-29 13:30 GMT

గెలుపు క్రెడిట్ మొత్తం తనదే అన్నట్లుగా భావిస్తుంటారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయనకు తగ్గట్లే ఆయన వందిమాగధులు సైతం అదే పాటను పాడుతుంటారు. దీంతో.. తనను తాను వీరుడిగా.. శూరుడిగా.. ఎదుటోళ్లు చేతకానోళ్లుగా.. చవటలుగా.. మరగుజ్జులుగా భావించే ధోరణి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యర్థి ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతోనే విజయం వరిస్తుందని పొరపాటే. ఎందుకుంటే.. ప్రత్యర్థి చెడు చేస్తాడన్న ప్రచారం బాగానే ఉన్నా.. తాను మంచి చేస్తానన్న విషయాన్ని ప్రజలు ఫీల్ కాకపోవటం ఫెయిల్యూరే అవుతుంది కదా? ఆ చిన్న లాజిక్ జగన్ ఎందుకు మిస్ అయ్యారు?

విజయం చేతికి చిక్కిన తర్వాత.. దాన్ని తనతో పాటు ఉంచుకునేలా చేయటం అందరికి సాధ్యం కాదు. గెలుపును హ్యాండిల్ చేయటం కూడా అంత సామాన్యమైన విషయం కాదు. గాలి వాటున గెలుపు రాలేదన్న విషయాన్ని ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాజకీయ అధినేతల మీద ఉంటుంది. ఇందుకు వారు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి. ఈ విషయాన్ని అర్థం కంటే అపార్థం చేసుకున్నారు జగన్. అదే ఆయన్ను ఈరోజున ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పాలి. నిత్యం తనదైన ప్రపంచంలో ఉంటూ.. తన ప్రపంచంలోకి తాను కోరుకున్న వారు మాత్రమే రావాలని కోరుకోవటం అధికారం చేతిలో ఉన్న వాళ్లు అస్సలు అనుకోకూడదు.

Read more!

తన చేతికి అధికారం ఎలా వచ్చిందన్న విషయాన్ని పవర్ లో ఉన్నప్పుడు మర్చిపోకూడదు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి ఈతిబాధల్ని అర్థం చేసుకోవటం.. వారి బతుకులకు సరికొత్త భరోసా ఇస్తానన్న నమ్మకంతోనే తనకు విజయం సాధ్యమైన విషయాన్ని అధికారంలోకి వచ్చిన వారానికే జగన్ మర్చిపోయారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తొలినాళ్లలో జగన్ నోటి నుంచి వచ్చిన మాటలకు.. ఆ తర్వాత వచ్చిన వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన ఉండదు.

ప్రత్యర్థుల్ని సైతం స్నేహితులుగా చూసే తీరును తాను ప్రదర్శిస్తానని చెప్పినప్పుడు చాలామందికి నమ్మకం కలగలేదు. ఎందుకుంటే.. జగన్ తీరు గురించి తెలిసిన వారంతా.. ఆయన మాటలకు విస్మయానికి గురయ్యారు. అధికారం ఆయన్ను మార్చిందని భావించారు. కానీ.. అదంతా తమ భ్రమేనన్న విషయాన్ని చాలా త్వరగానే గుర్తించారు ఆయన్ను క్లోజ్ గా ఫాలో అయ్యేవారు.

ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న జగన్.. తొలుత తన సంక్షేమ పథకాల లబ్థిదారులను నిందించే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయనకు తత్త్వం బోధ పడింది. ఆ వెంటనే ఒకలాంటి విరక్తి ఆయన్ను కమ్మేసింది. ఏమిటిదంతా.. తాను ఎంతో నమ్మి చేస్తే.. చివరకు తనే అధికారం లేకుండా చేస్తారా? అంటూ చిరాకు పడిన జగన్.. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లే ఆలోచన చేశారు. అంతలోనే ఆయన్ను కమ్మేసిన ఆలోచనలతో.. ప్రజలకు మరింత దగ్గర కావాలని డిసైడ్ అయ్యారు.

ఎన్నికల ఫలితాలు.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. జగన్ తాను నడిచే దారిని.. తాను తీసుకునే నిర్ణయాన్ని తన కోణం నుంచి మాత్రమే చూస్తారు తప్పించి.. సగటు జీవి ఎలా చూస్తారన్న ఆలోచన ఆయన చేయలేదు. ఎంత గొప్ప దర్శకుడైనా సరే.. తనకు అనిపించే కోణంలో సినిమా తీస్తే అట్టర్ ప్లాప్ అవుతుంది. కానీ.. తాను అనుకున్న కథను ప్రేక్షకులు చూసే కోణం.. వారు ఫీల్ అయ్యే అంశాల్ని వారి కోణం నుంచి ఆలోచించి తీస్తే అది అదిరే బొమ్మ అవుతుంది.

జగన్ విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజున చంద్రబాబుకు రాజయోగం కలిగిందంటే దానికి కారణం చంద్రబాబు కష్టం కంటే కూడా.. జగన్ చేసిన తప్పులే ఎక్కువ. ఆ మాటకు వస్తే పవన్ కల్యాణ్ ఈ రోజున 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో తన అభ్యర్థుల్ని గెలిపించుకున్నారంటే దానికి పవన్ కష్టంతో పాటు.. ఆయన్ను జగన్ అండ్ కో టార్గెట్ చేసి.. వెటకారాలు.. వేధింపు వ్యాఖ్యలే ఆయన్ను గెలుపు తీరాలకు తీసుకెళ్లిందని చెప్పాలి. వీరితో పాటు.. ప్రస్తావించాల్సిన మరో పేరు నారా లోకేశ్.

మంగళగిరిలో లోకేశ్ విజయం అంత తేలిక కాదు. కానీ.. లోకేశ్ ను అదే పనిగా అతన్ని హేళన చేసి ఉండకపోయి ఉంటే.. తాము ఎటకారం చేసే పప్పు నుంచి నిప్పుగా రూపాంతరం చెందేవారు కాదు. మొత్తంగా చూస్తే.. లేటు వయసులో చంద్రబాబుకు రాజయోగం.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు ఏ మాత్రం సూట్ కారన్న భావనకు బదులుగా పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కీర్తించారంటే దానికి ఒకే ఒక మేజర్ కారణం జగన్ అనే వ్యక్తి మాత్రమేనని చెప్పక తప్పదు. ఆయన చేసిన తప్పులే వారికి వరాలుగా మారాయని మాత్రం ఒప్పుకోక తప్పదు.

Tags:    

Similar News