ఇంటర్ పోల్ 'సిల్వర్ నోటీస్'... ఆ 10 మంది ఇండియన్స్ పని అయిపోయినట్లేనా?

ప్రపంచ దేశాలకు నేర సంబంధిత అంశాల్లో వారధిగా ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్) మరో కీలక స్టెప్ తీసుకుంది

Update: 2025-01-11 06:01 GMT

ప్రపంచ దేశాలకు నేర సంబంధిత అంశాల్లో వారధిగా ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్) మరో కీలక స్టెప్ తీసుకుంది. సభ్య దేశాలకు రంగుల కోడ్ కలిగిన నోటీసులు జారీ చేసే ఈ సంస్థ తాజాగా... సరిహద్దులు దాటి వెళ్లే అక్రమ సంపదను గుర్తించేందుకు ఫస్ట్ టైం "సిల్వర్ నోటీసు" జారీ చేసింది. దీంతో.. భారత్ నుంచి పారిపోయిన 10 మంది అంశం తెరపైకి వచ్చింది!

అవును.. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్ పోల్) మొట్టమొదటిసారిగా సిల్వర్ నోటీసులు జారీ చేసింది. సరిహద్దులు దాటి వెళ్లి విదేశాల్లో అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాల గుట్టు విప్పేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. ఓ మాఫియా మెంబర్ ఆస్తులకు సంబంధించి ఇటలీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు తొలిసారిగా వీటిని జారీ చేసినట్లు ఇంటర్ పోల్ వెల్లడించింది.

అయితే.. ఆ మాఫియా మెంబర్ ఎవరు అనేది సభ్యదేశాలకు మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేసిన ఇంటర్ పోల్.. ఈ నోటీసు ఈ ఏడాది నవంబర్ వరకూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. ప్రధానంగా.. అవినీతి, అక్రమాలు, మాదక ద్రవ్యాలు, పర్యావరణ, రవాణా సంబంధ నేరాలు వంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను గుర్తించేందుకు ఈ తరహా నోటీసులు జారీ చేస్తామని తెలిపింది.

ఈ సమయంలో... ఇంటర్ పోల్ లో భారత్ కూడా సభ్యదేశమే కాబట్టి.. ఈ దేశం నుంచి సుమారు 10 మంది ఆర్థిక నేరగాళ్లు పారిపోయిన జాబితాలో ఉన్నారు! అయితే.. భారత్ నుంచి విదేశాలకు తరలించిన నల్లధనం మొత్తం ఎంత అనే విషయంపై కచ్చితమైన అంచనాలు లేనప్పటికీ.. ఈ తాజా సిల్వర్ నోటీసులు ఆ 10 మంది విషయంలో భారత్ కు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు.

ఇది ఎనిమిదో రంగు నోటీసు!:

ఫ్రాన్స్ లోని లియోన్ నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంటర్ పోల్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్య దేశాల నుంచి అవసరమైన సమాచారం కోసం ఇప్పటి వరకూ 7 రకాల రంగుల నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా... రెడ్, ఎల్లో, బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ కలర్ కోడ్ లను వాడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ జాబితాలో సిల్వర్ ను జోడించింది.

ఇందులో భాగంగా... ఓ నేర ఘటన దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని లేదా ప్రాంతన్ని గుర్తించేందుకు ఇచ్చేవి బ్లూ నోటీసులు కాగా.. ప్రజల భద్రతకు ప్రమాదంగా మారిన వక్తి, అతడి నేర కార్యకలాపాలపై గ్రీన్ నోటీసులను జారీ చేస్తారు. ఇదే సమయంలో.. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోసం జారీ చేసేవి బ్లాక్ నోటీసులు.

ఒక ఘటన, వ్యక్తి, వస్తువు, ప్రక్రియల కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదం అని భావిస్తే ఆరెంజ్ నోటీసులు.. ఆయుధాలు, లక్ష్యాలు, రహస్య విధానలకు సంబంధించిన సమాచారంతో పర్పుల్ నోటీసులు సభ్య దేశాలకు పంపుతుంది. ఇక, విదేశాలకు పారిపోయిన వారిని నిర్భందించాలని కోరేందుకు రెడ్ నోటీసులు జారీ చేస్తుంది.

Tags:    

Similar News