ప్రధాని మోడీ మనసు దోచిన ఇప్పపువ్వు లడ్డూలో ఏం ఉంటుంది?
ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్ ప్రోగ్రాం గురించి తెలిసిందే.;

ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రిక మన్ కీ బాత్ ప్రోగ్రాం గురించి తెలిసిందే. ఎక్కడో మారుమూల జరిగే ఆసక్తికర అంశాలతో పాటు.. స్ఫూర్తివంతమైన విషయాల్ని.. వెలుగు చూడని ఎన్నో విజయగాధల్ని పరిచయం చేస్తుంటారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం మన్ కీ బాత్ లో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూ గురించి ప్రస్తావించారు.
ఈ లడ్డూ ప్రత్యేకత ఏమంటే.. గిరిజన గర్భిణులు.. బాలింతలు.. రక్తహీనతతో బాధపడే వారికి ఇస్తే.. ఆ సమస్యల్ని అధిగమించేలా చేస్తుంది. ఒక్కో లడ్డూ 20 గ్రాముల వరకు ఉంటుంది. ఇంతకీ ఈ లడ్డూను ఎలా తయారు చేస్తారు? అన్నది ఆసక్తికరం. సహజసిద్ధమైన వస్తువులు ఈ లడ్డూ తయారీలో వినియోగిస్తారు. 400 గ్రాముల ఇప్పపువ్వులు.. 190 గ్రాముల నవ్వులు.. 190 గ్రాముల బెల్లం.. 190 గ్రాముల పల్లీలు.. 30 గ్రాముల కిస్మిస్.. మంచి నూనెతో కలిపి కేజీ లడ్డూల్ని తయారు చేస్తారు.
ఈ లడ్డూ బలవర్థకమైన ఆహారంగా ఉంటుంది. ఈ కారణంగానే 2020 పైలెట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 1845, కుమురం భీం జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణులకు ఈ ఇప్పపువ్వు లడ్డూల్ని అందించారు. అంతేకాదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్పపువ్వు లడ్డూల్ని అందిస్తున్నారు.
ఈ లడ్డూల్ని భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు చేస్తుంటారు. దీని ధర కేజీ రూ.30. ఈ లడ్డూ గురించి మన్ కీ బాత్ లో మోడీ ఏం చెప్పారంటే.. ‘తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారు. వారు రకరకాల వంటలు చేస్తున్నారు. వీటిని ప్రజలు ఇష్టపడుతున్నారు. వారి వంటల్లో ఆదివాసీల కల్చర్.. తియ్యదనం కూడా దాగుంది’ అన్న మాటలు ఈ లడ్డూ ఇమేజ్ ను మరింత పెంచుతున్నాయి.