బీజేపీ మహా మంత్రాంగం : పవార్ ని పెంచుతూ షిండేను తగ్గిస్తూ !
పైగా కోరుకున్న శాఖలు కూడా దక్కలేదు అని అనుచరులు అంటున్నారు.
శివసేన అధినేత బీజేపీ మిత్రుడు అయిన ఏక్ నాధ్ షిండేని చూసి పాపం అని అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన ఇపుడు మహాయతి కూటమిలో ఏమీ కాకుండా అయిపోతున్నారని అంటున్నారు. ఏక్ నాధ్ షిండె ఒకనాడు సీఎం. ఇపుడు చూస్తే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా కోరుకున్న శాఖలు కూడా దక్కలేదు అని అనుచరులు అంటున్నారు.
తాను డిప్యూటీ సీఎం గా ఉన్నా పవర్ ఫుల్ హోం శాఖ కావాలని షిండే కోరారని అంటున్నారు. అయితే ఆయనకు పట్టణాభివృద్ధి, ప్రజా పనులు, గృహ నిర్మాణం వంటి మూడు శాఖలు ఇచ్చారు. హోం శాఖను మాత్రం బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ తన వద్దనే ఉంచుకున్నారు
ఇక మరో మిత్రపక్షం అయిన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కి అతి ముఖ్యమైన ఆర్థిక శాఖతో పాటు ప్లానింగ్, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు. ఈ శాఖలు పంచడానికి కూడా నాలుగు వారాలు చర్చలు జరిపి చివరికి నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఏక్ నాధ్ షిండే తనకు ముఖ్యమంత్రి కావాలని మొదట డిమాండ్ చేయడంతోనే కొత్త ప్రభుత్వం ప్రమాణం ఆలస్యం అయింది. ఇక తాను డిప్యూటీ సీఎం తీసుకోను అని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. కానీ ఫడ్నవీస్ స్వయంగా ఆయనను కలసి ఒప్పించారని చెబుతారు. పోనీ హోం శాఖ ఇస్తారని అనుకుంటే సాధారణ శాఖలే దక్కాయని ఆయన వర్గం అంటోంది.
ఇంకో వైపు అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ మాట్లాడుతూ ఆయనను శాశ్వత ఉప ముఖ్యమంత్రి అని అంటున్నారని కానీ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని అది కూడా ఏనాడో ఒకనాడు జరిగి తీరుతుందని జోస్యం చెప్పారు. అలా పవార్ ప్రాధాన్యత మహాయతి కూటమిలో పెరుగుతోంది.
మరి ఏక్ నాధ్ షిండేను నెమ్మదిగా సైడ్ చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్ధవ్ థాక్రే శివసేన అధినేత అయిన మాజీ సీఎం ఠాక్రే ఫడ్నవీస్ ని ప్రత్యేకంగా కలసి మాట్లాడడం రాజకీయంగా చర్చలకు ఆస్కారం ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే మళ్లీ ఉద్ధవ్ థాక్రే బీజేపీ వైపు వస్తారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఈ మొత్తం పరిణామాలను చూసుకుంటే కనుక ఏక్ నాధ్ షిండే ఇచ్చిన శాఖలను పుచ్చుకుని తన పని తాను చేసుకోవడమే అని అంటున్నారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉంది. పైగా అజిత్ పవార్ మద్దతు ఉంది. ఇక బీజేపీ తలచుకుంటే ఏక్ నాధ్ షిండే శివసేనలో కూడా కొత్త షిండేలను పుట్టించగలదు అని అంటున్నారు. అలా 2022లో అనూహ్యంగా సీఎం అయిన షిండే ఇపుడు డిప్యూటీగా మారిపోయారని అంటున్నారు.