ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్

కేసీఆర్ తో నేర్పిన అత్యంత సఖ్యత ఇప్పుడు వారిని ఇరకాటంలో పడేసింద‌ని అంటున్నారు.

Update: 2024-10-24 16:30 GMT

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పిన ఎంఐఎం పార్టీ ముఖ్య నేతలు అస‌దుద్దీన్‌, అక్బరుద్దీన్ ఓవైసీలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. తమ పరిస్థితి ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసీఆర్ తో నేర్పిన అత్యంత సఖ్యత ఇప్పుడు వారిని ఇరకాటంలో పడేసింద‌ని అంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నప్పుడు ఎంఐఎం అత్యంత శక్తివంతంగా ఉండటమే కాకుండా అత్యంత సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క‌ సీటు కూడా గెలుచుకోలేని స్థితిలో ఘోర పరాజయం పాలవడం ఎఫెక్ట్ ఎంఐఎం పై కూడా పడింది. ప్రస్తుతం వివిధ‌ రాష్ట్రాల్లో ఎన్నికల హ‌డావుడి నెల‌కొన్న స‌మ‌యంలో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేని స్థితిలోకి ఎంఐఎం చేరింది. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ భవిష్యత్తును బీఆర్ఎస్ తో దోస్తీ ప్రణాళిక దెబ్బేసింది అనుకోవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఎంఐఎం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీల‌లో కాంగ్రెస్ తో ఉన్న అనుబంధం మరే ఇత‌ర‌ పార్టీతోను ఎంఐఎం కి లేదు. అయితే తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దోస్తీ గులాబీ పార్టీ వైపు మారడం, కాంగ్రెస్ విబేధాలు రావడం తెలిసిన సంగతే. అయితే, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం వైపు కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్ర‌స్తుతం అందరి చూపు పడిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలి అనే ఎంఐఎం ఆలోచనలు ఫలించేలా కనిపించట్లేదు.

మ‌హారాష్ట్రలోని ముంబై కార్పొరేషన్‌ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ మ‌రియు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం కొంత ఓటు బ్యాంక్‌ను సాధించింది. దీనికి కొన‌సాగింపుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగి కొన్నిచోట్లైనా కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని ఎంఐఎం ఆలోచించినప్పటికినీ ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. తెలంగాణలో తమ పట్ల వ్యవహరించిన వైఖరిని గుర్తు చేసుకోవడంతో పాటుగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో ఉన్న దోస్తీ నేపథ్యంలో ఎంఐఎంని కాంగ్రెస్ పార్టీ లైట్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కీలక రాష్ట్రమైన‌ మహారాష్ట్రలో ముస్లిం మైనారిటీ ఓట్లతో తన సత్తా చాటుకోవాలనుకున్న ఎంఐఎం ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News