బిగ్ కామెంట్.. పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్..?

మరోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టేవారో లేదో తెలియదు కానీ.. ఓటమితో మాత్రం మాజీగా మిగిలిపోయారు.

Update: 2025-02-10 16:31 GMT

ఢిల్లీకి దాదాపు పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించారు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్. 2014లో కొంత కాలమే సీఎంగా ఉన్నా.. 2015 నుంచి 2024 సెప్టెంబరు వరకు ఏకధాటిగా దేశ రాజధానిని ఏలారు. అయితే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకెళ్లి వచ్చాక గత ఏడాది సెప్టెంబరులో రాజీనామా చేశారు. ఇక తాజా ఎన్నికల్లో గెలుపొందితే కథ ఎలా ఉండేదో..? మరోసారి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టేవారో లేదో తెలియదు కానీ.. ఓటమితో మాత్రం మాజీగా మిగిలిపోయారు. మరిప్పుడు కిం కర్తవ్యం..?

ఆప్ పుట్టిన తర్వాత అధికారానికి దూరంగా ఉన్నది కొద్ది కాలమే. ఓ సామాజిక కార్యకర్తగా 2012 నవంబరు 26న ఆప్ ను స్థాపించారు కేజ్రీ. సరిగ్గా 13 నెలల్లో అంటే 2013 డిసెంబరు 28న తొలిసారి సీఎం అయ్యారు. ఈ ప్రభుత్వం 2014 ఫిబ్రవరి వరకే కొనసాగింది. రాజకీయ సంక్షోభంతో తదుపరి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఆప్. గత శనివారం వరకు అధికారంలో కొనసాగింది.

గోవా వరకు వ్యాపించి.. జాతీయ పార్టీగా ఎదిగి

గత పదేళ్లలో ఆప్ పంజాబ్ ను గెలిచింది.. గుజరాత్ లో సత్తా చాటింది.. గోవా వరకు విస్తరించింది.. జాతీయ పార్టీ స్థాయికి కూడా ఎదిగింది. గోవా ఎన్నికల సందర్భంగానే మద్యం స్కాంతో అప్రదిష్ఠపాలైంది. తాజాగా ఢిల్లీలో ఓడిపోయింది.

పంజాబ్ లో మూడేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ అక్కడ సీఎంగా భగవంత్ సింగ్ మాన్ ను నియమించింది. ఇపుడు ఆయనను అసమర్థుడిగా ముద్ర వేసి తప్పించే యోచన చేస్తోందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా. అందుకనే కేజ్రీవాల్ మంగళవారం పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు.

మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో.. కేజ్రీని గొప్ప వ్యక్తిగా కొనియాడుతూ ఆయన పంజాబ్ సీఎంగా రావాలనే డిమాండ్ వస్తుందని మంజీందర్ తెలిపారు. ఇవన్నీ ఆరోపణలే అయినా నిజాలు కాకూడదని ఏమీ లేదు.

కేజ్రీ రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం స్కాం అనే కాదు.. ఆప్ ను మట్టానికి తొక్కేయాలని చూస్తోంది బీజేపీ. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీ కూడా ‘తాను పదవిలో’ శ్రేయస్కరంగా భావించి పంజాబ్ సీఎం పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యపోవనసరం లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

Tags:    

Similar News