షేర్ల బదిలీ : విజయమ్మ, షర్మిలపై జగన్ కౌంటర్ పిటీషన్?
ఈ పిటిషన్‌లో ఆయన తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల తన అనుమతి లేకుండా తన పేరు , తన భార్య వైఎస్ భారతి పేరుతో ఉన్న షేర్లను బదిలీ చేసుకున్నారని ఆరోపించారు.;
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆయన తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల తన అనుమతి లేకుండా తన పేరు , తన భార్య వైఎస్ భారతి పేరుతో ఉన్న షేర్లను బదిలీ చేసుకున్నారని ఆరోపించారు.
జగన్ తన పిటిషన్‌లో ఈ షేర్ల బదిలీ ప్రక్రియ తన అనుమతి లేకుండా జరిగినదని పేర్కొన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన ట్రైబ్యునల్‌ను అభ్యర్థించారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిలతో పాటు సండూర్ పవర్ , రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
గత వారం జగన్ మరో మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసి, షేర్ల బదిలీపై స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరారు. బదిలీ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం వద్ద విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై వాద , ప్రతివాద పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరారు. తద్వారా ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు ప్రాధాన్యత పెరుగుతుండటంతో వైఎస్సార్ కుటుంబానికి చెందిన ఈ షేర్ల విషయంలో న్యాయపరమైన సంక్లిష్టతలు మరింత స్పష్టమవుతున్నాయి.
ఇప్పటికే విజయమ్మ NCLT ముందు తన వాదనను వినిపిస్తూ.. జగన్, భారతీ ట్రిబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. "సరస్వతి షేర్ల బదలాయింపు షర్మిల పేరిట జరగలేదని నేను స్పష్టంగా చెబుతున్నాను. నా కూతురుకు ఈ వ్యవహారానికి సంబంధం లేదు. అయినా ఆమెను ఇందులో అనవసరంగా లాగుతున్నారు" అని విజయమ్మ స్పష్టం చేశారు. అలాగే, సరస్వతి పవర్ షేర్లపై తానే పూర్తిగా హక్కుదారునని విజయమ్మ పేర్కొన్నారు.
జగన్ ఈ కేసులో మరోసారి పిటీషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.