చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్ పై రెచ్చిపోయిన పరిటాల సునీత
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన రాజకీయ వేడి రాజేసింది. ఇప్పటికే మంచి కాకమీదున్న రాప్తాడు రాజకీయం జగన్ పర్యటనతో మరింత హీటెక్కింది.;

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన రాజకీయ వేడి రాజేసింది. ఇప్పటికే మంచి కాకమీదున్న రాప్తాడు రాజకీయం జగన్ పర్యటనతో మరింత హీటెక్కింది. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వైసీపీ అధినేత జేజేలు కొట్టించుకోవడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అవుతున్నారు. మాజీ సీఎం జగన్ చావు పరామర్శకు వచ్చారా? ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా? అంటూ డౌటు పడిన సునీత, చావు ఇంట జేజేలు కొట్టించుకోవడమేంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీ చుట్టూ ఉన్న వాళ్లుఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారు. నువ్వూ నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదంటూ సునీత సెటైర్లు వేయడం వైరల్ అవుతోంది.
రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో మంగళవారం మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనకు ముందు నుంచి స్థానికంగా టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ కార్యకర్త హత్య తర్వాత.. ఎమ్మెల్యే పరిటాల సునీతపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. అయితే వైసీపీకి కౌంటరుగా తన భర్త, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్యతో జగన్ కు సంబంధం ఉందంటూ పరిటాల సునీత ఆరోపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సైతం ఎమ్మెల్యే సునీత టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక ఈ హైటెన్షన్ వాతావరణంలోనే రాప్తాడులో అడుగుపెట్టిన మాజీ సీఎం జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఆరోపణలకు కౌంటరుగా మాట్లాడిన ఎమ్మెల్యే సునీత తాను తలుచుకుంటే మాజీ సీఎం జగన్ రాప్తాడులో అడుగు పెట్టేలేరంటూ హెచ్చరించడం గమనార్హం.
తనను తన కుమారుడిని టార్గెట్ చేయడానికే మాజీ సీఎం జగన్ రాప్తాడు పర్యటనకు వచ్చారని ఎమ్మెల్యే సునీత ఆరోపించారు. జగన్ మాట్లాడినవన్నీ అసత్యాలు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రాసిచ్చిన స్క్రిప్టును యథావిధిగా చదివేశామంటూ ఆరోపించారు. పరీక్షల్లో చూసి రాసినట్లు ఎవరో రాసిచ్చింది చదువుతున్న జగన్ ప్రశాంత పల్లెల్లో చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాపిరెడ్డిపల్లెలో అనుకోని సంఘటన జరిగిందని లింగమయ్య హత్యపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే.. పులివెందుల నియోజకవర్గంలో పోలింగు బూతుల్లో కొడవళ్లు పట్టుకుని చంపుతారని ఆరోపించారు. మీ చిన్నాన్నను చంపితే న్యాయం చేయమని అడిగిన చెల్లికి న్యాయం చేయలేదు. చెల్లికి న్యాయం చేయలేని నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావంటూ జగన్ ను ప్రశ్నించారు సునీత. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని నువ్వు, లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తావంటూ నిలదీశారు.
మాజీ సీఎం అయివుండి ఓ ఎస్ఐ గురించి నీచంగా మాట్లాడుతున్నావు. పోలీసుల గుడ్డలు ఊడదీస్తానని చెబుతున్నావు.. జగన్ వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీతోపాటు పోలీసు అధికారుల సంఘం స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎస్ఐ మాకు ఫోన్ చేయించాడని బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పాలంటూ సునీత సవాల్ విసిరారు. మేము భవగద్గీత మీద ప్రమాణం చేస్తామని వ్యాఖ్యానించారు.