అన‌వ‌స‌రం జ‌గ‌న్‌.. ఈ లొల్లి..!

తాజాగా హ‌రియాణాలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు-ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలుస్తూ.. ఈవీఎంల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు.

Update: 2024-10-10 09:30 GMT

ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టుగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ కొత్త విమ‌ర్శ‌ల‌ను, కొత్త వివాదాల‌ను భుజాల‌పై ఎత్తుకుంటున్నారు. దీనివ‌ల్ల ఆయ‌న మ‌రింత‌గా రాజ‌కీయ వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొ న‌డంతోపాటు.. కీల‌క పార్టీల నేత‌ల‌కు కూడా టార్గెట్ అవుతున్నారు. తాజాగా హ‌రియాణాలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు-ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలుస్తూ.. ఈవీఎంల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. అయితే.. రాజ‌కీయంగా జ‌గ‌న్ ఉద్దేశం ఏదైనా.. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు నెగిటివ్ అయ్యాయి.

ప్ర‌స్తుతం వైసీపీ ప‌రిస్థితి సంక్లిష్టంగా ఉంది. ఎక్క‌డ ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. పార్టీని, పార్టీ అధినేత‌ను కూడా ఇత‌ర పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. మ‌రీముఖ్యంగా టీడీపీ అనేక రూపాల్లో వైసీపీని ల‌క్ష్యంగా చేసుకుని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. మ‌రోవైపు.. 11 అసెంబ్లీ స్థానాల‌కే ప‌రిమితం కావ‌డం.. లోక్‌స‌భ‌లో 4 సీట్ల‌కే ప‌రిమితం కావ‌డం వంటివి జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు.. రాజ్య‌స‌భ స‌భ్యులు ఎప్పుడు ఎవ‌రు ఉంటారో.. ఎవ‌రు పోతారో తెలియ‌ని ప‌రిస్థితి కూడా ఏర్పడింది.

ఇలాంటి కీల‌క స‌మయంలో గ‌తంమ‌రిచిపోయి.. భ‌విష్య‌త్తుపై జ‌గ‌న్ దృష్టి పెట్టాల్సి ఉంది. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నాయ‌క‌త్వానికి ఆయ‌న చేరువ కావాల్సి కూడా ఉంది. లేక‌పోతే.. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. రాబోయే రోజుల్లో అయినా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తే అప్పుడు స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా మారిపోయే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. వైసీపీపైనా పెను ప్ర‌భావం ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఈవీఎంలు, హ‌రియాణాలో బీజేపీ విజ‌యం, కాంగ్రెస్ ఓట‌మి వంటివాటిని ప్ర‌స్తావించ‌డం ద్వారా జ‌గ‌న్‌కుఏపీలో పెరిగే ఓటు బ్యాంకు అంటూ ఏమీ ఉండ‌దు. పోనీ.. కాంగ్రెస్ పార్టీకి ద‌న్నుగా నిలిస్తే.. అప్పుడేమైనా ప్ర‌యోజ‌నం ఉంటుందా? అంటే.. అది కూడా క‌ష్ట‌మ‌నే అంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌నేది మేధావుల సూచ‌న‌. అలా కాకుండా..లేనిపోని విష‌యాల‌ను భుజాన వేసుకుంటే అంతిమంగా న‌ష్ట‌పోయేది వైసీపీనేన‌ని ఆయ‌న గుర్తించాలి.

Tags:    

Similar News