జగన్ ఇంటిపై ప్రభుత్వ నిఘా.. వైసీపీ తప్పు చేసిందా?
మాజీ సీఎం జగన్ ఇంటి పరిసరాల్లో నిఘాకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
మాజీ సీఎం జగన్ ఇంటి పరిసరాల్లో నిఘాకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవల జగన్ ఇళ్లు, వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదురుగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు జగన్ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా పుటేజ్ అప్పగించాల్సిందిగా పోలీసులు రెండు రోజుల క్రితం కోరారు. కానీ వైసీపీ స్పందించకపోవడంతో ప్రభుత్వమే మాజీ సీఎం ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుతోంది.
మాజీ సీఎం జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన వైసీపీ.. ప్రభుత్వం అడిగిన పుటేజీ ఇవ్వక తప్పుచేసిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ సీసీ పుటేజీ ఇవ్వకపోవడంతో అదే అదునుగా భావించిన ప్రభుత్వం తాడేపల్లి పోలీసుల ద్వారా జగన్ ఇళ్లు, అటు వైపు వచ్చీపోయే రోడ్లపై ప్రత్యేక నిఘాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలను తాడేపల్లి పోలీసు స్టేషన్ నుంచి ఆపరేట్ చేస్తారు. దీనివల్ల జగన్ ఇళ్లు, వైసీపీ ఆఫీసుల్లో ఏం జరుగుతుంది? ఎవరెవరు వచ్చిపోతున్నారు? అన్న విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకునే వీలు కల్పించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిణామం వల్ల ఇప్పటికిప్పుడు వైసీపీకి పెద్దగా నష్టం లేకపోయినా, భవిష్యత్ లో రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నేతలతో నిరంతరం టచ్ లో ఉండే నేతలు, ప్రభుత్వ వ్యతిరేకులను సులువుగా గుర్తించేలా ప్రభుత్వం జగన్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ.. ఆఫీసు సీసీ కెమెరా పుటేజీని ఇస్తే ఈ పరిస్థితి తలెత్తే అవకాశం లేదని అంటున్నారు. ఏదైనా జగన్ ఇంటిపై నిఘాకు వైసీపీయే ప్రభుత్వానికి వీలు కల్పించిందనే టాక్ వినిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం జగన్ ఇంటి పరిసరాల్లో ఎండిన గడ్డి తగలబడిన విషయం తెలిసిందే. ఈ గడ్డికి నిప్పు ఎవరు పెట్టారో గానీ, అక్కడ చెలరేగిన మంటలు రాజకీయంగా దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా పోలీసులు వైసీపీ కార్యాలయం వద్ద ఉన్న సీసీ పుటేజీని పరిశీలించాలని కోరారు. అయితే వైసీపీ స్పందించకపోవడంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు అమర్చుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.