15 ఏళ్ల బాబు పాలనపై జనసేన ఇలా.. బీజేపీ అలా..!
ఏపీలో కూటమి ప్రభుత్వంపై.. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకరకంగా స్పందిస్తుంటే.. బీజేపీ నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు.;

ఏపీలో కూటమి ప్రభుత్వంపై.. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకరకంగా స్పందిస్తుంటే.. బీజేపీ నాయకులు మరో విధంగా స్పందిస్తున్నారు. వచ్చే 15 ఏళ్లపాటు.. చంద్రబాబే ముఖ్య మంత్రిగా ఉంటారని జనసేన అధినేత చెబుతున్నారు. తాను చంద్రబాబు నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని కూడా ఆయన అంటున్నారు. తనకు పాలన పరంగా చంద్రబాబు మార్గదర్శి కూడా చెబుతున్నారు. ఆయన అనుభవాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. 15 ఏళ్లపాటు ఆయన సారథ్యం అవసరమని చెబుతున్నారు.
అంటే.. వచ్చే 15 సంవత్సరాల పాటు.. అంటే.. మరో మూడు ఎన్నికల వరకు కూడా.. చంద్రబాబును ముఖ్యమంత్రిగా జనసేన అంగీకరిస్తోంది. దీనికి కారణాలు ఏవైనా.. జనసేన తన లైన్‌ను ప్రకటించింది. తద్వారా ఆ పార్టీకి ఇబ్బందులు వస్తాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. జనసేన మాత్రం పక్కా క్లారిటీతో ఉంది. ఇక, కూటమిలో మరో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ మాత్రం ఈ విషయంలో పవన్‌తో విభేదిస్తుండడం గమనార్హం.
బీజేపీ సీనియర్ నాయకుల్లో చాలా మంది టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. ఇక, పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఉన్నప్పటికీ.. చంద్రబాబును ఆమె పరోక్షంగా సమర్థిస్తున్నారు. కానీ, ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న నాయకులు మాత్రం జనసేన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, మాధవ్, జీవీఎల్ నరసింహారావు వంటివారు.. జనసేన చేసిన 15 ఏళ్ల రాజకీయాలను సమర్ధించకపోగా.. వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
15 ఏళ్లపాటు సీఎంగా చంద్రబాబు మాత్రమే ఉండాలన్నది.. జనసేన వ్యక్తిగత అభిప్రాయమని.. అదికూట మి నిర్ణయం కాబోదని సోము వీర్రాజు బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇక, ఇతర నాయకులు మాత్రం అంతర్గత చర్చల్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ.. తమకు 15 ఏళ్లపాటు చంద్రబాబు అవసరం లేదని యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది వారి మాటగా వినిపిస్తోంది. సో.. ఈ విషయంలో జనసేన ఒక నిర్ణయంతో ఉండగా.. పార్టీ కీలక నాయకులు భిన్నమైన వాదన వినిపిస్తుండడం గమనార్హం.