జనసేన నేత కారుకు నిప్పు పెట్టేశారు.. మచిలీపట్నంలో కొత్త రచ్చ
ఏపీలో రాజకీయం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాన పార్టీలకు చెందిన వారు ఒకరిపై ఒకరు విమర్శలు
ఏపీలో రాజకీయం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాన పార్టీలకు చెందిన వారు ఒకరిపై ఒకరు విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న హింస ఒక ఎత్తు అయితే.. ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగతంగా టార్గెట్లు చేస్తూ వారి ఆస్తులపై దాడికి పాల్పడుతున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఈ హింస.. దాడులు మీవంటే మీవేనంటూ అధికార.. విపక్షాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. విచారించాల్సిన విషయం ఏమంటే.. గతంలో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లోనూ ఈసారి ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం.. పోలింగ్ తర్వాత ప్రతీకార చర్యలకు పాల్పడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక పరిస్థితుల మాటేమిటి? అన్నదిప్పుడు ప్ఱశ్నగా మారింది.
తాజాగా క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకున్న పరిణామం అక్కడ సంచలనంగా మారింది. పట్టణంలో ఉద్రికత్తలకు దారి తీసింది. జనసేనకు చెందిన కర్రి మహేశ్ అనే నేత కారును గుర్తు తెలియని వ్యక్తులు తగుల బెట్టారు. ఇంటి ముందు పార్కు చేసిన కారును నిప్పు పెట్టటంపై మహేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన కారును తగలబెట్టినట్లుగా చెబుతున్నారు.
తన కారును అధికార పార్టీకి చెందిన వారే తగుల పెట్టారన్న ఆరోపణ సంచలనంగా మారింది. జనసేన తరఫున ప్రచారం చేశానే తప్పించి.. ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏమీ చేయలేదని చెబుతున్నారు. జనసేన తరఫున ప్రచారం చేస్తే తనపై ఎందుకు పగబడుతున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తరఫున పని చేస్తే తట్టుకోలేకపోతున్నారని.. గతంలోనే తమ ఇంటిపై అర్థరాత్రి వేళలో దాడి చేసినట్లుగా చెప్పారు.
తమను కొట్టిన వారిపై కేసు పెడితే.. రోజులో వారంతా తిరిగి బయటకు వచ్చి తిరుగుతున్నారని.. ఇప్పుడు తన కారును వారే తగులబెట్టారని ఆరోపిస్తున్నారు. కారుకు పెట్టిన మంటలు తమ ఇంటి గోడ వైపు వ్యాపించాయని.. వంటిల్లు అక్కడే ఉందని.. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే.. తమ కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లమన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ కారును తగలబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీని కోరారు. ఈ ఉదంతం పట్టణంలో కొత్త టెన్షన్ కు కారణమైందంటున్నారు.