జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ ఇచ్చిన హైకోర్టు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-10-24 07:48 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ లో 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెప్టెంబర్‌ 16న పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, కోర్టు ఆయన్ని రిమాండ్‌కు తరలించింది. జానీ మాస్టర్‌ చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలో బెయిల్‌ కోసం ఆయన న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు.

న్యాయ ప్రక్రియలో భాగంగా పిటిషన్‌ను పోక్సో కోర్టు తొలుత తిరస్కరించినా, తరువాతి విచారణలో న్యాయమూర్తి జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. కాగా, ఆగష్టులో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అనుమతించిన తాత్కాలిక బెయిల్‌ అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా బెయిల్‌ మంజూరవడంతో ఆయన గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలవ్వబోతున్నారు.

ఇదంతా ఎలా ప్రారంభమైందంటే, 2017లో టీవీ షో ద్వారా పరిచయమైన ఓ మహిళా డ్యాన్సర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ముంబైలోని ఓ హోటల్‌లో తనపై లైంగికదాడి జరిగిందని, వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని, ఒప్పుకోకపోతే అవకాశాలు రాకుండా చూస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో బాధితురాలు మరిన్ని వివరాలు వెల్లడించడంతో కేసు మరింత తీవ్రమైంది.

బెయిల్‌ మంజూరు తర్వాత జానీ మాస్టర్‌ తరపున ఆయన న్యాయవాదులు ఈ కేసు పూర్తిగా అప్రూవ్‌ కానిదని, కోర్టు ముందు అన్ని అంశాలను సరిగా చర్చించాలని కోరుతూ వాదనలు వినిపించారు. జానీ మాస్టర్‌కు ఈ కేసు నుంచి ఊరట లభించినా, సినీ పరిశ్రమలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సగటు ప్రేక్షకులు ఈ కేసు దశల మార్పుపై, కోర్టు తీర్పు పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక నేషనల్ అవార్డు కూడా రద్దవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయంలో కొంతమంది డ్యాన్సర్లు ప్రముఖులు జానీ మాస్టర్ కు మద్దతు ఇచ్చారు. మహిళా కొరియోగ్రాఫర్స్ కూడా జానీ మాస్టర్ విషయంలో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక ఈ విషయంలో అసలు నిజాలు ఎప్పుడు భయటపడతాయో చూడాలి.

Tags:    

Similar News