జేసీ సరే.. అసలు సమస్య ఆదితోనేట... !
రాయల సీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయాష్(బూడిద) వ్యవహారం ఇప్పుడు మరింత సెగలు పుట్టిస్తోంది.
ఉమ్మడి కడప, అనంతపురం జిల్లాల్లో గత మూడు నాలుగు రోజులుగా రచ్చ రేపుతున్న రాయల సీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయాష్(బూడిద) వ్యవహారం ఇప్పుడు మరింత సెగలు పుట్టిస్తోంది. ఫ్లైయాష్ రవాణా వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి, బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు సవాళ్లు రువ్వుకుంటున్నారు. దాడులు ఒక్కటే తక్కువ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
ఫ్లైయాష్‌ను కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు నుంచి అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న ఎల్టీ సిమెంటు ఫ్యాక్టరీకి తరలించాలి. ఈ వ్యవహారంలో ఆధిపత్య ధోరణికి ఇద్దరు నాయకులు తెరదీశారు. అంతేకాదు.. రీజియన్ల విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. తామంటే తామే రవాణా చేస్తామని పట్టుబడుతున్నారు. ఇది స్థానికంగా ఉన్న అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిపైనా చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
బుధవారం రోజు రోజంతా ఆర్టీపీపీ వద్ద వందల మంది పోలీసులు పహారాకాచారు. అయితే.. ఆ రోజు సమ స్యలు తలెత్తకపోయినా.. ఏక్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు మాత్రం ఉక్కిరిబిక్కిరికి గురవుతు న్నారు. మరోవైపు నాయకుల ఆధిపత్య రాజకీయాలు చంద్రబాబు వరకు చేరాయి. పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఇరు జిల్లాల కలెక్టర్ల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆది, జేసీలు వచ్చి తనను కలవాలని చంద్రబాబు ఆదేశించారు.
అయితే.. ఇక్కడ జేసీ విషయంలో ఇబ్బంది లేకవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన టీడీపీ నాయకుడే కావడంతో చంద్రబాబు చెప్పినట్టు వినే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఆది నారాయణరెడ్డి బీజేపీనాయకుడు, పైగా.. కేంద్రంలోని పెద్దలతోనే ఆయన టచ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పినట్టు ఆయన వింటారా? లేక ఏకపక్షంగా వ్యవహరిస్తారా? అనేది చూడాలి.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సొంత పార్టీ ఎంపీ సీఎం రమేష్ కాంట్రాక్టులపైనే ఆది యుద్ధంచేస్తున్న విషయం తెలిసిందే. సో.. ఆది ఇప్పుడు చంద్రబాబు తలనొప్పిగా మారారనిస్థానిక నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.