ప్రముఖ జర్నలిస్టు ‘బాబాయ్‌’ ఇక లేరు!

ప్రముఖ జర్నలిస్ట్‌ సీహెచ్‌వీఎం కృష్ణారావు కన్నుమూశారు.

Update: 2023-08-17 09:04 GMT

ప్రముఖ జర్నలిస్ట్‌ సీహెచ్‌వీఎం కృష్ణారావు కన్నుమూశారు. క్రానికల్‌ కృష్ణారావుగా, బాబాయ్‌ గా జర్నలిస్టు, పొలిటికల్‌ సర్కిళ్లలో ఆయన సుపరిచితులు. జర్నలిజం రంగంలో ఆయనకు 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఏడాది కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న కృష్ణారావు అనారోగ్యంతో మరణించారు.

ప్రముఖ దినపత్రికలైన ఆంధ్రభూమి, దక్కన్‌ క్రానికల్‌ తదితర పత్రికల్లో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. 1975లో ఒక సాధారణ స్ట్రింగర్‌ గా కెరీర్‌ ను ప్రారంభించిన కృష్ణారావు అనతికాలంలోనే జర్నలిజం రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. తన సుదీర్ఘ కెరీర్‌ లో పలు ప్రముఖ తెలుగు పత్రికల్లోనే కాకుండా ఇంగ్లీష్‌ వార్తా పత్రికల్లోనూ ఆయన విధులు నిర్వర్తించారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ సీహెచ్‌ఎంవీ కృష్ణారావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర కేబినెట్‌ మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్‌ జర్నలిస్టుగా ఎన్నో సేవలు అందించారని కేసీఆర్‌ కొనియాడారు. ప్రజా ప్రయోజనాల కోణంలో ఆయన వార్తలు రాసేవారని, టీవీ చర్చల్లోనూ అర్థవంతమైన విశ్లేషణలు చేసేవారని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఆయన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని కొనియాడారు. 40 ఏళ్లకు పైగా జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న కృష్ణారావు మృతి పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సీనియర్‌ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకుడు సీహెచ్‌ఎంవీ కృష్ణారావు పాత్రికేయ విలువలకు పట్టం గట్టారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

కృష్ణారావు జర్నలిజంలో సరికొత్త విలువలను ఆద్యుడిగా నిలిచారని భట్టి విక్రమార్క కొనియాడారు. ఏ మీడియా సంస్థలో పనిచేసినా తనదైన ముద్ర వేసిన ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నానని విచారం వ్యక్తం చేశారు.

తెలుగు, ఇంగ్లీష్‌ జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. జర్నలిస్ట్‌గా కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కృష్ణారావు మృతి పట్ల తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Tags:    

Similar News