కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షలో కడియం పేరు... రియాక్షన్ ఇదే!
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2023లో తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించే ప్రయత్నంలో భాగంగా
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2023లో తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించే ప్రయత్నంలో భాగంగా... మరోసారి సత్తాచాటాలని కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా బీఆరెస్స్ కు చెందిన పలువురు కీలక నేతలను ఆకర్షిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారగా... తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
అవును... కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఇప్పుడు చూపు కడియం శ్రీహరి వైపు మల్లిందని.. ఆయనను ఆకర్షించే పనిలో కాంగ్రెస్స్ పార్టీ నిమగ్నమైందని.. ఇది బీఆరెస్స్ కు ఊహించని దెబ్బే అవుతుందని.. తన కుమార్తె పొలిటికల్ ఫ్యూచర్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కడియం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి అనే వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే తాజాగా ఈ విషయాలపై కడియం శ్రీహరి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు.. ఇందులో భాగంగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదే సమయంలో కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పరిస్థితి లేదని.. బీఆరెస్స్ నుంచి ఎవరూ పార్టీని వీడటం లేదని.. పార్టీలోని ప్రతీ కార్యకర్తనూ తాము కాపాడుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలను కొట్టిపారేశారు.
కాగా... టీడీపీ నుంచి టీఆరెస్స్ లో చేరిన కడియం శ్రీహరి తొలుత వరంగల్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. అనంతరం ఆ పదవికి రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ను చేశారు కేసీఆర్. ఈ క్రమంలో 2018లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు కానీ.. ఎమ్మెల్సీ మాత్రం రెన్యూవల్ అయ్యింది. అయితే... 2023లో రాజయ్య గెలిచే అవకాశం లేదని భావించిన కేసీఆర్.. కడియం కు టిక్కెట్ ఇవ్వగా.. ఆయన గెలిచారు.
దీంతో... తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అయితే... గతకొన్ని రోజులుగా ఈ విషయంలో కడియం కాస్త మెతక వైఖరి ప్రదర్శించారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో... తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కడియం శ్రీహరి ఖండించారు.