మీ బడిలో బాంబుంది.. బెంగళూరులో 40 స్కూళ్లకు బెదిరింపులు..

కర్ణాటకకు చెందిన భత్కల్ సోదరులు గతంలో దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-01 10:17 GMT

ఐదు పది ఇరవై ముప్పై నలభై... ఏమిటీ అంకెలు అనుకుంటున్నారా? ఉద్యాన నగరి, భారత ఐటీ రాజధాని బెంగళూరులో శుక్రవారం బాంబు బెదిరింపులు ఎదుర్కొన్న పాఠశాలల సంఖ్య.. మొదట ఏక అంకెలో మొదలై అలాఅలా నలభై పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. అసలే గతంలో ఉగ్రవాద మూలాలూ బయటపడిన రాష్ట్రంలోని నగరం కావడం.. ఐటీ, ఇతర సంస్థల కీలక కేంద్రం కావడంతో ప్రొఫెషనల్స్, ఉన్నతాధికారుల పిల్లలు ఉండడంతో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి.

కర్ణాటకకు చెందిన భత్కల్ సోదరులు గతంలో దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వారి నేపథ్యం అదికాకున్నా.. ఉగ్రవాదం వైపు మళ్లారు. మరోవైపు మొన్నటివరకు ఉన్న బీజేపీ ప్రభుత్వంలో హలాల్ –హిజాబ్ వివాదాలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. ఇక తాజా బాంబు బెదిరింపులు కూడా శుక్రవారం పూట రావడంతో దుమారం రేగింది. గుర్తుతెలియని ఈ మెయిల్ అడ్రస్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

మీ బడిలో బాంబుది అంటూ..

ఎక్కడో కాదు.. మీ బడిలో బాంబులు పెట్టామంటూ ఈ మెయిల్స్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు. తొలుత శుక్రవారం ఉదయం ఏడు ప్రైవేటు స్కూళ్లకు మెయిల్స్ వచ్చాయి. తర్వాత కొద్దిసేపటికే ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. కాసేపటికే 15కు చేరగా.. చివరకు 44కు పెరిగింది. రాజధాని బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. బెదిరింపులు వచ్చిన స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులను పంపించారు. బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

బెదిరింపు ఇక్కడే.. అన్నీ రిచ్ ఏరియాలే..

బెంగళూరు అంటేనే హైటెక్ నగరం. అలాంటిచోట ఖరీదైన ప్రాంతాలైన వైట్‌ ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్‌, యెళహంక, సదాశివనగర్‌ లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కాగా,

వీటిలో ఒక పాఠశాల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోనిది కావడం గమనార్హం. దీంతో బాంబు బెదిరింపు వచ్చిన స్కూల్ కు ఆయనే వెళ్లి పరిశీలించారు.

నిరుడు కూడా..

బెంగళూరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు.. నిరుడూ ఏడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్న నకిలీవి. తాజా వదంతులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిరుటిలానే ఇవీ నకిలీ బెదిరింపులే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మెయిల్స్ పంపినవారి కోసం గాలిస్తున్నారు. కాగా, నిరుటి కంటే ఈ ఏడాది బెదిరింపులు వచ్చిన పాఠశాలల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ విషయం అందరికీ ఆందోళనకరంగా మారింది.

Tags:    

Similar News