దేశం పేరు మార్పుపై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు!

ఇండియా పేరును భారత్‌ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-06 05:34 GMT

ఇండియా పేరును భారత్‌ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

దేశం పేరును ‘భారత్‌’గా మార్చాల్సిన అవసరం లేదన్నారు. ముందు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీని మార్చేయాలని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

‘ఇండియా’ పేరు రాజ్యాంగంలో భాగంగా ఉందని సిద్ధరామయ్య గుర్తు చేశారు. దేశమంతా ఆమోదించిన ఈ పేరును భారత్‌ గా మార్చాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ప్రతిపక్ష కూటమి పేరు (ఇండియా కూటమి)ను బట్టి దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్‌ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి పట్ల ఎన్‌డీఏ కూటమికి, బీజేపీకి ఎందుకంత భయమని నిలదీశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియా కూటమి పట్ల ఉన్న భయం కారణంగానే దేశం పేరును మార్చాలని ప్రయత్నిస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. కారణం ఇది కాకపోతే.. ఇండియా పేరును మార్చడానికి ఇంకే కారణం ఉందో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇండియా పేరును భారత్‌ గా మార్చితే దేశంగా మారుతుందా? అని ప్రశ్నించారు.

దేశం పేరు మార్చడం కాదని.. దేశ పరిస్థితిని, ప్రజల జీవన ప్రమాణాలను ప్రధాని మోడీ మార్చాలని సిద్ధరామయ్య సూచించారు. ద్వేషంతో సమాజ శాంతికి భంగం కలిగిస్తున్న మీ భక్తుల (బీజేపీ నేతలు) మనసు మార్చాలని హితవు పలికారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేశారని, జాతి, కులం పేరుతో శాంతిని దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్, ఇండియా అనే రెండు పేర్లు మన హృదయాల్లో నాటుకుపోయాయని సిద్ధరామయ్య గుర్తు చేశారు. భారతదేశం అంటే మరొకటి కాదు ఇండియానే అని వెల్లడించారు. దురుద్దేశంతో కాకుండా భారత్‌ అని పేరు పెడితే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ విపక్ష పార్టీల కూటమిని లక్ష్యంగా చేసుకుని దేశం పేరును మార్చడం సరికాదన్నారు.

ఇదే అంశంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందిస్తూ బీజేపీయేతర పార్టీలన్నీ ‘ఇండియా’గా ఏర్పాటవటంతో బీజేపీ ఆ పేరును జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఏకంగా దేశం పేరునే మార్చేంతగా బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. తద్వారా ఇండియా కూటమిలోని పార్టీలు బీజేపీని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తోందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అంటూ నోట్లపై ముద్రించగా లేనిది ప్రస్తుతం కేంద్రానికి వచ్చిన సమస్య ఏమిటని నిలదీశారు. బీజేపీ ఏమైనా సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలనని అనుకుంటోందా అని డీకే ప్రశ్నించారు.

Tags:    

Similar News