బీజేపీ ఎంట్రీ.. 50 మంది ఎమ్మెల్యేలకు వల.. సిద్దూ సర్కారుకు సెగ..!
కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగలనుందా?
కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగలనుందా? సిద్దూ సర్కారును కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి గత వారం పది రోజులుగా కర్ణాటక రాజకీయం సీఎం సీటు చూట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య సీఎం సీటు రచ్చగా మారింది.
అయితే.. రాత్రికి రాత్రి బీజేపీ ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్‌లో అసంతృప్త ఎమ్మెల్యేలకు వల విసిరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. తమకు 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు మద్దతిస్తున్నారని.. ఈ విషయంలో అదిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మురుగేష్ నిరాణి బాంబు పేల్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మూడు, నాలుగు గ్రూపులుగా చీలిపోయారని అన్నారు.
సీఎం పీఠం విషయంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి తారస్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు దక్కని సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపి అధిష్టానంతో మాట్లాడుతున్నార ని, సరైన సమయయంలో వీరి పేర్లను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఐదేళ్లు సాగబోదన్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వచ్చే మూడు నాలుగు మాసాల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు.
సిద్దూకు కుమార సెగ కూడా!
మరోవైపు మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా.. సిద్దూ సర్కారుకు సెగ పెడుతున్నారు. సిద్దరామయ్యను కాదని.. ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కుమార వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంటే.. తాము కూడా.. డీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని అన్నారు. మొత్తంగా ఈ పరిణామాలు.. కర్ణాటకలో సిద్దూ(సిద్దరామయ్య) ప్రభుత్వానికి సెగ పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.