మీపై దర్యాప్తు చేయాల్సిందే: కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి హైకోర్టు షాక్
కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు లో భారీ షాక్ తగిలింది
కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులను విచారణ చేయాల్సిందేనని.. నిజా నిజాలు తేలాల్సిందేనని కర్ణాటక హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. అంతేకాదు.. గతంలో సీబీఐ విచార ణపై విధించిన స్టేను కూడా ఎత్తేసింది. మొత్తానికి ఈ అక్రమాస్తుల కేసుల వ్యవహారాన్ని మూడు మాసాల్లో పూర్తి చేసి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించడం గమనార్హం.
దాదాపు ఏడాదిన్నర కిందట.. కాంగ్రెస్ కర్ణాటక చీఫ్‌గా ఉన్న డీకే శివకుమార్.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఒకటి రెండు రాష్ట్రాల్లో ఆయన చాతుర్యం ప్రదర్శించి.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన కాపాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా రాత్రికి రాత్రి.. ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ.. తొలుత ఐటీ, తర్వాత సీబీఐ ఎంట్రీ ఇచ్చాయి. అప్పట్లో ఈ దాడులు కలకలం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు కూడా చేశారు. ఇక, శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ కొనసాగుతుండగానే.. కర్ణాటక ఎన్నికలు వచ్చాయి.
దీంతో ఎన్నికల వేళ తనకు రిలీఫ్ ఇవ్వాలన్న శివకుమార్ అభ్యర్థనను పరిగణనించిన కర్ణాటక హైకోర్టు.. సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా ఇప్పుడు శివకుమార్ కు అదే హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది.