కశ్మీర్ మారింది బాస్.. క్రెడిట్ మోడీదే.. తాజా పోలింగ్ ఎంతో తెలుసా?

జమ్ముకశ్మీర్ లోక్ సభ స్థానానికి జరిగిన పోలింగ్ లో ఏకంగా 56.73 శాతం నమోదు కావటం విశేషంగా చెప్పాలి.

Update: 2024-05-21 04:13 GMT

సార్వత్రిక ఎన్నికల్లో హైలెట్ లాంటి అంశం తాజాగా చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో మొత్తం ఏడు దశల్లో జరిగే పోలింగ్.. సోమవారంతో ఐదు దశలు పూర్తి అయ్యాయి. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ తో పాటు..రాబోయే రోజుల్లో జరిగే పోలింగ్ లోనూ వావ్ అనేలాంటి పరిణామం కశ్మీర్ లో నిర్వహించిన పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. దశాబ్దాల తరబడి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపించిన కశ్మీరీలు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున పోలింగ్ లో పార్టిసిపేట్ చేయటం ఆసక్తికరంగా మారింది.

 

సోమవారం జరిగిన పోలింగ్ ఎనిమిది రాష్ట్రాల్లోని 49 లోక్ సభ స్థానాలకు జరిగింది. ఇందులో బిహార్ లో 5 స్థానాలు, జమ్ముకశ్మీర్ లో ఒక స్థానం.. జార్ఖండ్ లో 3, లఢక్ లో ఒకటి.. మహారాష్ట్రలో 13.. ఒడిశాలో 5.. ఉత్తరప్రదేశ్ లో 14.. పశ్చిమబెంగాల్లో 7 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో అందరిని ఆకర్షిస్తున్న అంశం.. జమ్ముకశ్మీర్ లోక్ సభ స్థానానికి జరిగిన పోలింగ్ లో ఏకంగా 56.73 శాతం నమోదు కావటం విశేషంగా చెప్పాలి. లడక్ లో అయితే 69.62 శాతం పోలింగ్ నమోదు కావటం చూస్తే.. ఎన్నికల ప్రక్రియలో కశ్మీరీలు పాలుపంచుకున్న వైనం దేశానికి శుభసూచికంగా చెప్పాలి.

సోమవారం జరిగిన పోలింగ్ లో అత్యధిక పోలింగ్ పశ్చిమబెంగాల్ (74.6 శాతం)లో నమోదు కాగా.. అతి తక్కువగా మహారాష్ట్రలో (54.29 శాతం) నమోదైంది. జార్ఖండ్ లో 63.07, ఒడిశాలో 67.59, ఉత్తరప్రదేశ్ లో 57.79 శాతం నమోదైంది. సోమవారం పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లో జమ్ముకశ్మీర్.. లఢక్ లో నమోదైన పోలింగ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. శ్రీనగర్ ఎంపీ స్థానానికి జరిగిన పోలింగ్ లో 30 శాతంనమోదైంది. మామూలుగా చూస్తే ఈ అంకె చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ.. ఇది పాతికేళ్ల రికార్డుగా చెప్పాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సింగిల్ డిజిట్ శాతానికే పోలింగ్ జరిగేది.

తాజాగా జరిగిన బారాముల్లా ఎంపీ స్థానానికి ఇంత భారీగా పోలింగ్ నమోదు కావటం గొప్ప విషయంగా చెప్పాలి. దశాబ్దాల క్రితం.. సుమారు 1984లో ఇంత పోలింగ్ శాతం నమోదు కాగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడే నమోదైన పరిస్థితి. గడిచిన నలభై ఏళ్లలో ఎన్నికల్లో పోలింగ్ అంటే ఏడెనిమిది శాతం.. లేదంటే తొమ్మిది శాతమే తప్పించి.. అంతకు మించి అడుగు ముందుకు పడని పరిస్థితి. పోలింగ్ ను కశ్మీరీలు పట్టించుకునే వారు కాదు. అలాంటిది ఇప్పుడు 30 శాతం.. అరవై శాతం అంటే మాటలు కాదనే చెప్పాలి. జమ్ముకశ్మీర్ లో మాత్రమే కాదు లఢాక్ లోనూ భారీగా పోలింగ్ జరగటం శుభపరిణామంగా చెప్పాలి.

దీని క్రెడిట్ ఎవరికి చెందుతుందన్న దానిపై చర్చ షురూ అయ్యింది. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ ఇష్యూను మోడీ సర్కారు సెటిల్ చేయటం ఆర్టికల్ 370ను తీసేయటం ద్వారా ఇక్కడి పరిస్థితుల్లో పెను మార్పులకు తెర తీసినట్లుగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించకుండా ఏళ్లు ఏళ్లుగా గవర్నర్ పాలనపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నా.. తాజా పోలింగ్ కొత్త ఆశలకు.. ఆకాంక్షలకు తెర తీసిందని చెప్పాలి.

తాజాగా కశ్మీరలు తమ ఓటుహక్కును వినియోగించటానికి ఆసక్తిచూపటంతో మోడీ సర్కారుతో పాటు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పరిణామాలు కూడా కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. పాకిస్థాన్ లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు సైతం కశ్మీరీలు ఆలోచించేలా చేస్తుందంటున్నారు. కొంతకాలంగా పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్ లో మమేకం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాక్ ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో విలీనం అయ్యేందుకు పెద్ద ఎత్తున ఆందోళనల్నినిర్వహించటం తెలిసిందే.

తమ తోటి కశ్మీరీలు తిండి కోసం నానా తిప్పలు పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా తమ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండటం.. దానికి కారణం భారత్ లోని ప్రజాస్వామ్య వాతావరణమన్న వాస్తవాన్ని కశ్మీరీలు గ్రహిస్తున్నట్లుగా చెప్పాలి. పీవోకేలోని పరిస్థితులు.. పాక్ దీన ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాతచోటు చేసుకున్న పరిణామాలు తాజా పోలింగ్ పై పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News