టార్గెట్ పదహారు...అసెంబ్లీకి కేసీఆర్ సారు ?
బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను తెచ్చి ఆ పార్టీ శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.
తెలంగాణా రాజకీయం వేడెక్కుతోంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 నుంచి మొదలు కాబోతున్నాయి. ఇక కాంగ్రెస్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను తెచ్చి ఆ పార్టీ శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.
ఇప్పటికి చూస్తే 10 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ ఎస్ కి ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఇక ఒక శాసనసభా పక్షాన్ని వేరే పార్టీలో విలీనం చేసుకోవాలంటే మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు ఫిరాయించాలి. ఆ లెక్కన చూస్తే బీఆర్ఎస్ కి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు అంటే అందులో మూడింట రెండు వంతులు లెక్కన చూస్తే కనుక ఆ సంఖ్య 26కు చేరుకుంటుంది.
ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తే ఇక బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనం అయినట్లే. అంతే కాదు ఫిరాయింపులు చేసిన వారి మీద అనర్హత వేటు పడే ప్రసక్తే ఉండదు.
మరో వైపు చూస్తే తమ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి వారి మీద అనర్హత వేటు పడేలా చూడాలని బీఆర్ఎస్ స్పీకర్ ని కలసి ఫిర్యాదు చేసింది. వారు పార్టీ లైన్ దాటారు అని కూడా ఆరోపిస్తోంది. అయితే స్పీకర్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది పక్కన పెడితే ఈ విధంగా కొంత మంది ఎమ్మెల్యేలు వస్తే అది కచ్చితంగా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటుకు గురి అయ్యేలా ఉంటుంది.
అందుకే ఈ తలనొప్పులు ఎందుకు అని కాంగ్రెస్ వ్యూహం రూపొందిస్తోంది. దాని ప్రకారం చూస్తే మరో పదహారు మందిని కాంగ్రెస్ లో చేరిస్తే వారు హ్యాపీగా నాలుగేళ్ల పాటు అధికార పక్షం ఎమ్మెల్యేలుగానే ఉంటారు. ఏ వేటూ వారి మీద పడదు. దాంతో పాటు అసెంబ్లీలో బీఆర్ఎస్ బలాన్ని కూడా పూర్తిగా క్షీణింప చేయవచ్చు అన్నది ఎత్తుగడగా ఉంది.
దీనికి ఈ నెల 24వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకుని కాంగ్రెస్ పనిచేస్తోంది అని అంటున్నారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అనుకున్న నంబర్ వచ్చేంతవరకూ కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది.
కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా తమ మీద వేటు పడకుండా ఉండేందుకు తమ సాటి ఎమ్మెల్యేలను ఈ వైపుగా తీసుకుని వచ్చేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కేసీఆర్ కి కత్తి మీద సాముగా మారింది అని అంటున్నారు
మరో వైపు చూస్తే కేసీఆర్ అసెంబ్లీకి ఇప్పటిదాకా రాలేదు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు సార్లు అసెంబ్లీ సమావేశం అయినా కేసీఆర్ రాలేదు. అయితే ఈసారి అలా కాదు బీఆర్ఎస్ కి చావో రేవో అనేలా ఈసారి అసెంబ్లీ సెషన్ ఉంటుందని అంటున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోబోతున్నారు అని అంటున్నారు.
దాంతో తన పార్టీ ఎమ్మెల్యేలకు అండగా ఉండేందుకు అసెంబ్లీలో తాను నిలబడి అధికార పార్టీ మీద గర్జించేందుకు కేసీఅర్ సభకు హాజరైతే బాగుంటుంది అని అంటున్నారు. మరి కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలనే దూకుడు రాజకీయం చేస్తోంది.
అసలు ఇదంతా కేసీఆర్ నేర్పిందే అని అంటున్నారు. 2014, 2018లలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినపుడు కేసీఆర్ ఇలాగే విపక్షాన్ని బతకనీయకుండా విలీనం చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇపుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా కాంగ్రెస్ అదే దారిలో వెళ్తోంది. మొత్తానికి కారూ సారూ పదహారూ అని ఎంపీల విషయంలో ఒకనాడు ఒక పవర్ ఫుల్ స్లోగన్ వినిపించిన బీఆర్ ఎస్ కి మళ్లీ ఆ పదహారు నంబర్ దగ్గరే లంకె పడింది. మరి ఎలా దీన్ని అధిగమిస్తారో చూడాల్సిందే.