కేజ్రీవాల్ వ్యూహం వర్కవుట్ అయ్యేనా?
ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు.
హస్తినలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఢిల్లీ మద్యం స్కామ్ లో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు విడుదలయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. ఆయనను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు.
కాగా వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నవంబరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి దమ్ముంటే తమ సవాల్ కు సిద్ధం కావాలన్నారు.
అయితే ముఖ్యమంత్రి పదవికి వచ్చే రాజీనామా చేయడం వల్ల వచ్చే సానుభూతిని కేజ్రీవాల్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఆయన వ్యూహం ఇదేనని చెబుతున్నారు. కేజ్రీవాల్ సైతం తాను సీఎం పదవికి రాజీనామా చేశాక ఢిల్లీలో ఇంటింటికీ వెళ్తానన్నారు. తాను నిర్దోషినని భావిస్తేనే ఓటేయాలని ప్రజలను కోరతానన్నారు.
అందుకే వచ్చే ఫిబ్రవరి వరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆగకుండా ఈ ఏడాది నవంబరులోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటే నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే కేజ్రీవాల్ డిమాండ్ కు అంగీకరించే పరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) లేదని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారమే.. వచ్చే ఫిబ్రవరిలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉందని చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ సతీమణి సునీత, పీడబ్ల్యూడీ మంత్రి ఆతిషి, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా తదితరుల పేర్లు సీఎం పదవికి వినిపిస్తున్నాయి. తదుపరి సీఎం ఎవరనేదానిపై ఆప్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే కేజ్రీవాల్ సతీమణి సునీత పేరే ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలు, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఆప్ స్పందించింది. తన రాజీనామా పత్రాన్ని సీఎం కేజ్రీవాల్ గవర్నర్ కు అందిస్తారని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అది ఆమోదం పొందిన వెంటనే తదుపరి సీఎం ఎవరనే అంశంపై చర్చిస్తామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తామని వెల్లడించారు.
అలాగే ఆప్ పైన ప్రజలకు నమ్మకం ఉందని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీయేనని తెలిపారు. కొత్త సీఎం ఎవరనేది వారం రోజుల్లో తెలుస్తుందని సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే ముందస్తు ఎన్నికలపై బీజేపీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సవాల్ విసిరారు.