కడావర్ డాగ్స్..ఏంటీ వీటి గొప్ప!

కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతో పాటు వాటి ట్రైనర్లు దోమలపెంటకు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు.;

Update: 2025-03-07 07:08 GMT

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. పదమూడు రోజులు దాటింది కాబట్టి వారు చనిపోయారనే భావిస్తున్నారు. వారి డెడ్ బాడీలు సైతం ఆ బురదలోనే కూరుకుపోయాయని అనుమానిస్తున్నారు. అయితే వారు చనిపోయారని అధికారికంగా ప్రకటించలేదు. అయినా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్మికుల జాడ కనుగొనేందుకు కేరళ పోలీస్ శాఖకు చెందిన కడావర్ డాగ్స్ ను ప్రభుత్వం రప్పించింది. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతో పాటు వాటి ట్రైనర్లు దోమలపెంటకు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. శుక్రవారం నుంచి కడావర్ డాగ్స్ కార్మికుల జాడను పసిగట్టనున్నాయి.

పోలీసులు, ఆర్మీ వంటి భద్రతా బృందాల్లో పనిచేసే కెనైన్ డాగ్స్ వంటి ఒక బాధ్యతాయుతమైన పనిలో ఉండేవే ఈ కడావర్ డాగ్స్ కూడా. ఇవి ముఖ్యంగా గల్లంతైన మిస్టరీగా మారిన మరణాల వంటి కేసులను సాల్వ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కడావర్ డాగ్స్ పనితీరు కూడా మిగతా పోలీస్ డాగ్స్ మాదిరిగా నే ఉన్నా..ఇవి శరీరం కుళ్లిపోయే సమయంలో వచ్చే వాసనను పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ పొంది ఉంటాయి. కుళ్లిపోతున్న డెడ్ బాడీ వాసనను పసిగట్టడంలో ఈ డాగ్స్ 95 శాతం సక్సెస్ అవుతాయి. భూమిలో 15 అడుగుల కింద పాతిపెట్టిన దేహాల వాసనను సైతం ఇవి పసిగట్టగలవు. ఇలాంటి కేసుల్లో వీటిన మించిన డాగ్స్ ఉండవు అని చెబుతున్నారు నిపుణులు. ఈ డాగ్స్ కు అద్భుతమైన వాసన చూసే శక్తి ఉంటుంది. ఇవి మానవుల కంటే పది వేల నుంచి లక్ష రెట్లు ఎక్కువగా వాసనలను పసిగడుతాయి. వీటి పనితీరు అత్యంత కచ్చితత్వంతో ఉంటుంది.

నిరుడు కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగిపడి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. ఇంతటి సక్సెస్ ఫుల్ రికార్డు ఉన్న కడావర్ డాగ్స్ ను ఎస్ఎల్బీసీ వద్దకు రప్పించారు.

ప్రస్తుతం సొరంగం లోపల 13 కిటోమీటర్ పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) భాగాలు చెల్లాచెదురై టన్నెల్ మార్గానికి అడ్డుగా ఉన్నాయి. వీటిని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి 150 మీటర్ల వరకు టీబీఎం భాగాలు ఉండగా వాటి మధ్యలోనే కార్మికులు చిక్కుకుని ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ తెలుసుకోవడానికి కడావర్ డాగ్స్ ను రప్పించారు.

Tags:    

Similar News