మాజీ ఎంపీ + మాజీ మంత్రి.. ఆ జిల్లా బీఆర్ఎస్ కు మహా టఫ్!
తుమ్మల, పొంగులేటి ఒకేవైపు నిలిస్తే.. బీఆర్ఎస్ కు జిల్లాలో వారి స్థాయి బలమైన నాయకుడు పోటీ ఇవ్వాలి.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల రాజకీయం ఒక ఎత్తు.. ఆ జిల్లా రాజకీయం ఒక ఎత్తు. అన్ని జిల్లాల భౌగోళికత ఒక ఎత్తు.. ఆ జిల్లా భౌగోళికత మరో ఎత్తు.. అన్ని జిల్లాల వాతావరణం ఒక ఎత్తు.. ఆ జిల్లా వాతావరణం మరో ఎత్తు.. ఉద్యమ పరంగానూ అన్ని జిల్లాలు ఒక ఎత్తు.. ఆ జిల్లా మరో ఎత్తు.. అందుకే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇప్పుడు మరోసారి మారిన పరిణామాలతో రాజకీయాలు వేడెక్కాయి.
ఉమ్మడి ఖమ్మం అంటేనే ఉద్యమాల ఖిల్లా. అది వామపక్ష ఉద్యమం అయినా.. విప్లవోద్యమం అయినా.. విద్యార్థి ఉద్యమం అయినా.. ఏదైనా ఉమ్మడి ఖమ్మం కార్యక్షేత్రం. అలాంటి జిల్లాలో తెలంగాణ ఉద్యమం బలంగా సాగలేదు. అసలు 1969 తొలి దశ ఉద్యమానికి పునాది వేసిందే ఖమ్మం. కానీ, మలి దశ ఉద్యమం మాత్రం అంత గొప్పగా సాగలేదు. ప్రజల్లో తెలంగాణ కాంక్ష ఉన్నా.. నాయకత్వ లోపమే ప్రధాన కారణం. అయితే, 2009 తర్వాత పరిస్థితి మారింది. ఖమ్మంలోనూ తెలంగాణ ఉద్యమ పతాక ఎగిరింది. ఇక 2014 నాటికి రాష్ట్రం ఆవిర్భవించే సమయానికి కొద్దిగా ముందుగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కటే స్థానం దక్కింది. అదీ సింగరేణి కొత్తగూడెంలో మాత్రమే. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మళ్లీ ఒక్కటే స్థానం దక్కింది.
నాడు వర్గ పోరు.. నేడు చేజేతులా?
ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా బలం ఉన్న నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పొంగులేటి జూలైలో కాంగ్రెస్ లో చేరగా.. తుమ్మల మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీకి ఖమ్మంలో పెద్ద బలం అనే చెప్పాలి. అందులోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎన్నాళ్లనుంచో సంస్థాగతంగా పాతుకుపోయి ఉన్నారు. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. పొంగులేటి, తుమ్మల ఇద్దరూ బీఆర్ఎస్ లో నిరాదరణకు గురై ఆ పార్టీని వీడారు. ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నా 2018 ఎన్నికల్లో ఒకరికొకరు సహరించుకోలేదనే ఆరోపణలున్నాయి. అవన్నీ సమసిపోయి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎలా పనిచేస్తారన్నది చూడాలి. ఇక 2018లో తెలంగాణ అంతటా గాలి వీచినా.. వర్గ పోరుతో ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటుకే పరిమితమైంది బీఆర్ఎస్. మరిప్పుడు కూడా పరిస్థితులు ఏమంత సానుకూలంగా లేవని తెలుస్తోంది. తుమ్మల, పొంగులేటి ఒకేవైపు నిలిస్తే.. బీఆర్ఎస్ కు జిల్లాలో వారి స్థాయి బలమైన నాయకుడు పోటీ ఇవ్వాలి. అది జరగాలంటే మంత్రి అజయ్ కుమార్ బలంగా పనిచేయాల్సి ఉంటుంది.
అప్పుడు లక్షన్నర ఓట్లే..
2014లో తెలంగాణ ఖరారయ్యాక జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో పది నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు కేవలం లక్షన్నర. అయితే, తుమ్మల చేరాక 2018లో ఆ ఓట్లు నాలుగు రెట్లు పెరిగి దాదాపు 6.75 లక్షలకు చేరాయి. అలాంటి తుమ్మల ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడనున్నారు. దాదాపు సొంత చరిష్మాతో ఎంపీగా గెలుపొందిన పొంగులేటి కాంగ్రెస్ లో ఉన్నారు. వీరిద్దరినీ ఢీకొని బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించడం చాలా కష్టంతో కూడుకున్నదే. మరి అధికార పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.