రగులుతున్న మణిపూర్ కు ఇన్చార్జి మంత్రి కిషన్ రెడ్డి..?

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ పై పార్లమెంటులో చర్చకు సిద్ధమని ప్రకటించింది.

Update: 2023-07-21 11:51 GMT

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలలుగా రగులుతోంది. కుకీ-మెయిటీ తెగల సంఘర్షణతో అట్టుడుకుతోంది. మొన్నటికి మొన్న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేశమంతా ఇది మహా దారుణం అని స్పందించింది. ప్రతిపక్షాలు అయితే మణిపూర్ లోని బీజేపీ కూటమి సారథి, సీఎంగా వ్యవహరిస్తున్న బీరేన్ సింగ్ ను తొలగించాలని పట్టుబడుతున్నాయి. మణిపూర్ పై ప్రధాని మోదీ పార్లమెంటు వేదికగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇదంతా అలా ఉంచితే మణిపూర్ లో మే 3 నుంచి ఘర్షణలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఇంటర్నెట్ బంద్ చేశారు. ఇటీవలే పాక్షికంగా సేవలకు అనుమతించారు. ఈలోగానే మహిళలను దారుణంగా హింసించిన ఉదంతం బయటపడింది. దీనిపై సోషల్ మీడియా సంస్థలకు వీడియోను డిలీట్ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలిచ్చింది. ట్విటర్ పై అయితే ఏకంగా చర్యలు తీసుకునే యోచనలోనూ ఉంది.

అమిత్ షా వెళ్లారు.. మోదీ నోరిప్పారు..మణిపూర్ పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుసార్లు చర్చలు జరిపారు. నేరుగా ఆ రాష్ట్రానికి వెళ్లి విభిన్న వర్గాలతో సమావేశమయ్యారు. ఆయనవెంట ఉన్నత స్థాయి టీమ్ మణిపూర్ ను సందర్శించింది.

అక్కడ తలెత్తినది శాంతిభద్రతల అంశం కాబట్టి కేంద్ర హో మంత్రి హోదాలో అమిత్ షానే శాంతి సంధానకర్త. కానీ, దాదాపు 80 రోజులుగా రగులుతున్నఈశాన్య రాష్ట్రంపై ప్రధాని మోదీ మాత్రం నోరు విప్పలేదు. ఎట్టకేలకు అదీ పార్లమెంటు సమావేశాల ముంగిట గురువారం మణిపూర్ గురించి మాట్లాడారు.

ఇద్దరు మహిళల పై దారుణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోదీ స్పందించక తప్పలేదు. ఆఖరికి సుప్రీం కోర్ట్ కూడా చలించిపోయింది. కేంద్రానికి చర్యలపై అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ పై పార్లమెంటులో చర్చకు సిద్ధమని ప్రకటించింది.

కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల ఇన్చార్జి మంత్రి ఇదంతా అలా ఉంచితే.. మణిపూర్ చర్చ జరిగితే సభలో సమాధానం ఇచ్చేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని చెబుతున్నారు. ప్రధాని స్థాయికి మణిపూర్ అంశం తగదని కాబట్టి షానే జవాబిస్తారని పేర్కొంటున్నారు.

కానీ, ఇక్కడో విషయం ఏమంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. దానికి సారథ్యం వహించేది మరెవరో కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాజాగా పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి.

ఈయన పర్యాటక శాఖతో పాటు మినిస్టర్ ఆఫ్ డెవలప్ మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్. పర్యటక శాఖకు స్వతంత్ర హోదాలో కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. అదనంగా ఈశాన్య రాష్ట్రాల మంత్రి బాధ్యతలను చూస్తున్నారు.

తాజా సంక్షోభం నేపథ్యంలో కిషన్ రెడ్డి పెద్దగా జోక్యం చేసుకున్నది ఏమీ లేదని తెలుస్తోంది. మొత్తం అమిత్ షానే పర్యవేక్షించినట్లుగా సమాచారం. అందులోనూ కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వచ్చారు. ఈయన స్థానంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. మొత్తమ్మీద మణిపూర్ సంక్షోభ నివారణలో కిషన్ రెడ్డి పాత్ర పరిమితం.

Tags:    

Similar News