కొడనాడు ఎస్టేట్ కు, ఈ మాజీ సీఎంకు ఉన్న సంబంధం అదేనా?
కొడనాడు టీ ఎస్టేట్ లో జరిగిన హత్యలతోపాటు జయలలిత మృతిపైనా విచారణ జరపాలని కోరుతున్నారు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి తెలియనివారు లేరు. పదవిలో ఉంటూ అనారోగ్యంతో జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితాలు ఎప్పుడూ హాట్ టాపిక్ కే.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం తమిళనాడు రాజధాని చెన్నైలో కంటే తన కొడనాడు టీ ఎస్టేట్ లో ఉండేవారంటే అతిశయోక్తి కాదు. 1200 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొడనాడు ఎస్టేట్ నీలగిరి కొండల్లో ఉంది. వేలాది ఎకరాల మధ్యలో ఒక విలాసవంతమైన భవనం ఇందులో నెలకొని ఉంది. ఈ భవనంలో జయలలిత కన్నుమూశాక జరిగిన హత్యలు కలకలం రేపాయి.
జయ మృతి తర్వాత కొడనాడు ఎస్టేట్ లో ఉన్న భవనం వాచ్ మెన్ తోపాటు జయలలిత కారు మాజీ డ్రైవర్ కూడా హత్యకు గురయ్యారు. అంతేకాకుండా ఆ కొడనాడు టీ ఎస్టేట్ భవనంలో విలువైన వస్తువుల భారీ చోరీ కూడా చోటు చేసుకుందని తెలుస్తోంది. మొదట ఈ హత్యలు కేరళకు చెందిన మనోజ్ గ్యాంగ్ చేశారని పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో ఆ హత్యలకు, చోరీలకు ఆ గ్యాంగుతో సంబంధం లేదని వెల్లడైంది.
అన్నాడీఎంకే చెందిన పన్నీరుసెల్వం, పళనిస్వామి ముఖ్యమంత్రులుగా ఉన్నంతకాలం అసలు రహస్యం బట్టబయలు కాలేదు. జయలలిత అనుమానాస్పద మరణంలానే కొడనాడు టీ ఎస్టేట్ లో హత్యల విషయం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వీటిపై విచారణకు ఆదేశిస్తుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే.. తాము అధికారంలోకి వచ్చాక కొడనాడు టీ ఎస్టేట్ హత్యలతోపాటు జయలలిత అనుమానాస్పద మృతిపైనా విచారణ జరుపుతామని స్టాలిన్ తమ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్టాలిన్ తమిళనాడు సీఎంగా ఉన్నారు.
మరోవైపు జయలలిత మరణించాక పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యాయి. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీరుసెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక వీరిద్దరూ పార్టీపై పెత్తనం కోసం ప్రయత్నించారు. పార్టీ పగ్గాలు పళనిస్వామికే దక్కాయి. పన్నీరు సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో పన్నీరుసెల్వం.. శశికళతో, ఆమె మేనల్లుడు దినకరన్ తో చేతులు కలిపారు.
ఇప్పుడు వీరిద్దరూ డీఎంకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కొడనాడు టీ ఎస్టేట్ లో జరిగిన హత్యలతోపాటు జయలలిత మృతిపైనా విచారణ జరపాలని కోరుతున్నారు. కొడనాడు టీ ఎస్టేట్ లో హత్యలకు, అక్కడ ఉన్న జయలలిత భవనంలో విలువైన వస్తువుల మాయం, భారీ చోరీ కేరళ గ్యాంగ్ పని కాదని వెల్లడైంది. అటుతిప్పి.. ఇటు తిప్పి ఒక మాజీ సీఎం హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మాజీ సీఎం ఎవరో కాదని.. పళనిస్వామేనని అంటున్నారు. మరి డీఎంకే ప్రభుత్వం కొడనాడు టీ ఎస్టేట్ లో హత్యలు, జయలలిత నివాస భవనంలో భారీ చోరీకి కారకులు ఎవరో తేలుస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
డీఎంకే ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిని విచారించి పలు విషయాలు రాబట్టింది. ఆ తర్వాత డీఎంకే ప్రభుత్వం సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం, దినకరన్ వర్గాలు సిట్ విచారణలో విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. విచారణ అంశాలను బయటపడితే పళనిస్వామి పాత్ర బయటపడుతుందని భావిస్తున్నాయి.