ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయ్యారో.. వదలని వివాదాలు

MLA Kolikapudi Srinivasa Rao Attacks on Woman

Update: 2025-01-12 13:43 GMT

తన తప్పు ఉన్నా, లేకపోయినా వివాదాల్లో చిక్కుకోవడం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడికి శాపంగా మారింది. కూటమిలో 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎవరిపై లేనన్ని విమర్శలు, వివాదాలు కొలికపూడిని వెంటాడుతున్నాయి. తొలి రోజుల్లో అవగాహన లేక వివాదాల్లో చిక్కుకున్నారని భావించినా, ఏడు నెలల తర్వాత కూడా ఆయనపై అవే విమర్శలు వస్తుండటం అధికార టీడీపీకి తలనొప్పిగా మారింది.

ఏపీలో అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరుతెచ్చుకున్న తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం సందర్భంగా జరిగిన గొడవలో జోక్యం చేసుకోవడం ద్వారా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారని తాజాగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు మరోమారు ఎమ్మెల్యేను వివరణ కోరినట్లు సమాచారం.

తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం గోపాలపురంలో రోడ్డు నిర్మిస్తుండగా వివాదం జరిగింది. గ్రామానికి చెందిన భూక్యా రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శి. ఎమ్మెల్యే కొలికపూడి అనుచరుడు. ఆయన సోదరుడు భూక్యా క్రిష్ణ ఇంటి పక్కనే నివాసం ఉంటున్నారు. పల్లె పండగ పథకంలో భాగంగా గోపాలపురంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే భూక్యా క్రిష్ణ కుటుంబ సభ్యులు రోడ్డు వేయకుండా ముళ్ల కంపలు అడ్డుగా వేయడంతో వివాదం జరిగింది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే కొలికపూడి గ్రామానికి వెళ్లి టీడీపీ నేత భూక్యా రాంబాబుతో మాట్లాడారు. వివాదానికి కారణమేంటని తెలుసుకుని భూక్యా క్రిష్ణ కుటుంబ సభ్యులతో చర్చించేందుకు వారి ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే తమ ఇంటికి వచ్చి వెళ్లాక భూక్యా క్రిష్ణ భార్య చంటి పురుగుల మందు తాగేశారు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే కొలికపూడి తమ ఇంటికి వచ్చి కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. కానీ, ఎమ్మెల్యే ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా కంచె వేయడం తప్పని చెప్పానని అంతకుమించి తనకేమీ తెలియదని ఎమ్మెల్యే వివరణ ఇస్తున్నారు. అయితే ప్రతిపక్షం ఈ విషయంపై పెద్ద రాద్ధాంతం చేస్తుండటంతో అధిష్ఠానం జోక్యం చేసుకుందని అంటున్నారు. ఏం జరిగిందో వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేను సీఎం కార్యాలయం ఆదేశించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News