పైరవీ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రినే అవుతా !

ఈ నేపథ్యంలో మంత్రి పదవి కాదు, పైరవీ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి పదవే వస్తుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Update: 2024-07-25 04:35 GMT

"నేను మంత్రి పదవి కోసం ఎలాంటి పైరవీలు చేయడం లేదు. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్నా నా మంత్రి పదవికి అడ్డుకాదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశాను. నేను బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే మంత్రి పదవికి హామీ ఇచ్చారు. నేను నిజంగా పైరవీ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రిని అయ్యేవాడిని" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన సతీమణి పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా పట్టుబట్టడంతో ఏకంగా మంత్రి వర్గ విస్తరణనే వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కాదు, పైరవీ చేస్తే ఏకంగా ముఖ్యమంత్రి పదవే వస్తుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసేంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసిన సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ.20 నుండి రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కేవలం రూ.5 నుండి రూ.10 కోట్లు మాత్రమే ఇస్తున్నందున 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే 26 మంది కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల చేరికలపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags:    

Similar News