కేసే కాదన్న కేటీఆర్.. చివరకు ఏసీబీ హాజరయ్యే వరకు వచ్చింది
ఈ నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఉదయం పదిన్నర గంటల సమయంలో ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు.
కొన్నిసార్లు అంతే. మనం ఏ విషయాన్ని అయితే పెద్దగా పట్టించుకోమో.. సింఫుల్ గా తీసి పారేస్తామో.. అలాంటివే వెంటాడి వేధిస్తుంటాయి. ఊహించని షాకులు ఇస్తుంటాయి. ఇప్పుడు గులాబీ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు కేటీఆర్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన కేసు దర్యాప్తులో ఈ రోజు (సోమవారం) ఏసీబీ ఎదుట కేటీఆర్ హాజరు కానున్నారు. ఆయన్ను విచారించేందుకు వీలుగా.. ఆయన్ను తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. దీనికి సంబంధించిన సమన్లు జనవరి మూడున ఆయనకు జారీ చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఉదయం పదిన్నర గంటల సమయంలో ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కు నిబంధనలకు విరుద్ధంగా.. కేబినెట్ ఆమోదం లేకుండా.. రిజర్వు బ్యాంకు కు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాలతో పలు ధఫాల్లో రూ.54.88 కోట్లు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ.
ఈ అంశంపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏసీబీ గత డిసెంబరు 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను ఏ-1వచిాగా.. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్విందకుమార్ ను ఏ-2గా.. మాజీ సీఈ బీఎన్ఎన్ రెడ్డిని ఏ-3గా చేర్చింది. ఇప్పటివరకు సేకరించిన పత్రాలు.. సమాచారం ఆధారంగా కేటీఆర్ ను విచారణకు పిలిచి.. ప్రశ్నించేందుకు రంగం సిద్ధమైంది. ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ ను ఈడీ నమోదు చేసింది. దీనికి సంబంధించిన నోటీసును కేటీఆర్ కు పంపింది. జనవరి 7న (మంగళవారం) తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న బీఎల్ ఎన్ రెడ్డి.. అర్విందకుమార్ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత టైం కావాలని కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించిన ఈడీ.. వారిద్దరికి మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల ఎనిమిదిన బీఎల్ఎన్ రెడ్డిని.. తొమ్మిదిన అర్విందకుమార్ ను హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతం తనకు మరింత టైం కావాలని అడుగుతారా? నోటీసులకు తగ్గట్లే మంగళవారం హాజరవుతారా? అన్నది తేలాల్సి ఉంది. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ నిర్ణయం తీసుకునే వీలుందంటున్నారు.