పాత ట్రెండునే ఫాలో అవుతున్న కేటీఆర్, హరీశ్.. ప్రయోజనం ఉంటుందా..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గులాబీ పార్టీ పలురకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గులాబీ పార్టీ పలురకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పదేళ్ల తరువాత అధికారాన్ని కోల్పోవడం.. అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో కేడర్ అంతా నైరాశ్యంలో ఉంది. అటు రోజురోజుకూ నాయకత్వం కూడా బలహీనపడుతోంది. ఇక చాలా మంది పెద్ద లీడర్ల నుంచి చిన్న లీడర్ల వరకూ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత మరో కీలక ఆలోచన చేశారట. ఆయన ఆలోచన పాతదే అయినప్పటికీ ఇప్పుడు అది వర్కవుట్ అవుతుందా అనేది అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. దాంతో పెద్దాయన కోసం కేడర్ అంతా ఎదురుచూస్తూనే ఉంది. ఫామ్‌హౌస్ నుంచే నేతలకు కేసీఆర్ డైరెక్షన్లు ఇస్తున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఫలితంగా పార్టీ పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా తయారవుతోంది. కేడర్ కూడా భరోసా కోల్పోతోంది. దీంతో అధినేత మరో కీలక ఆలోచన చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీశ్ రావు ఇప్పుడు కీలక నేతలు. వారిద్దతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
ఇందులో భాగంగా తెలంగాణను రెండు భాగాలుగా విభజించుకొని.. ఇద్దరు నేతలకు ఒక్కో ఏరియా బాధ్యతలు ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కేటీఆర్, దక్షిణ తెలంగాణలో హరీశ్ రావు పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలకు సంబంధించి షెడ్యూల్, రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఉమ్మడి పది జిల్లాల్లోనూ వీరి పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ పాదయాత్ర ద్వారా పార్టీకి మైలేజీ వస్తుందని కేసీఆర్ ఆలోచన అని తెలుస్తోంది. అటు కేడర్‌లోనూ మరింత భరోసా నింపిన వారం అవుతామని అనుకుంటున్నారట. మరోవైపు.. ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పెద్దాయన ఆలోచన చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్న కేడర్ చేజారిపోకుండా కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయనేది పెద్ద ప్రశ్న. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్రను ప్రజలు ఆదరించారు. ఆయన సైతం రైతులు, ప్రజల కష్టాలను తెలుసుకొని చలించిపోయి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక వారిలో భరోసా నింపారు. ఇక.. ఆ తరువాత ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ తరువాత చంద్రబాబు సైతం పాదయాత్ర చేపట్టారు. అయితే.. తెలంగాణలో కొత్తగా పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల సైతం పాదయాత్ర చేశారు. కానీ.. ఆమెకు పెద్దగా ఫలితాలు రాలేదు. రాజన్న బిడ్డను అని చెప్పుకుంటూ ఆమె పాదయాత్ర చేసినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు.
మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాలేదు. మళ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. మరి ఇప్పుడే వీరు ఆతృతగా పాదయాత్ర చేస్తే భవిష్యత్తులో ఏ మేరకు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్న ప్రశ్న వినిపిస్తోంది. కేవలం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల కోసమే అయితే ఇంత పెద్ద ప్లానింగ్ అవసరం లేదేమో అన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇద్దరు కీలక నేతలు చేపడుతున్న ఈ పాదయాత్రలకు ఇప్పుడు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందా అన్న సందేహాలూ వినిపిస్తున్నాయి. ఏ మేరకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది..? ఏ మేరకు పార్టీకి కలిసివస్తుంది..? అన్న అనుమానాలు పార్టీలోనూ కలుగుతున్నాయి.