ఈ -కార్ రేసింగ్ ఉచ్చులో కేటీఆర్.. దేనినీ వదలబోమంటున్న కాంగ్రెస్

. తాజాగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లోనూ గోల్‌మాల్ జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి దీంతో ఇప్పుడు కేటీఆర్ మెడకు ఈ వివాదం చుట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-30 06:47 GMT

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో వారి పాలనలో ఎన్నో పథకాలు, మరెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం వచ్చేసింది. గతంలో అమలు చేసిన పథకాలపై, చేపట్టిన కార్యక్రమాల్లో జరిగిన అవకతవకాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జస్టిస్‌తో విచారణ నడుస్తోంది. అటు జీఎస్టీపైనా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వీటితోపాటే గొర్రెల స్కీమ్, తదితర పథకాలపైనా విచారణ కొనసాగుతోంది. తాజాగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లోనూ గోల్‌మాల్ జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇప్పుడు కేటీఆర్ మెడకు ఈ వివాదం చుట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఫార్ములా ఈ-కారు రేసింగ్ వివాదాన్ని వెలికితీసింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను ఈ-కారు రేసింగ్ నిర్వహణ సంస్థకు కేటాయించినట్లుగా వెల్లడైంది. దీనిపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రమేయం ఇందులో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. వెంటనే ఆయనను మున్సిపల్ శాఖ నుంచి బదిలీ చేసి విపత్తుల శాఖకు మార్చారు. అయితే.. ఆరు నెలలుగా ఈ వివాదాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇన్నాళ్లు సైలెంటుగా ఉన్న వివాదం ఇప్పుడు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. ఈ-కారు రేసులో నిధుల గోల్‌మాల్ జరిగిందంటూ మున్సిపల్ శాఖ తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే ఏసీబీ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ విచారణలో ఏం జరగబోతోందా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. మరోవైపు.. ఈ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ఎవరు టార్గెట్ అవుతారన్న చర్చ సైతం నడుస్తోంది.

గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ఫోన్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకే తాను ఈ కారు రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లు ఇచ్చినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నోట్ ఫైల్‌లో రాసినట్లు సమాచారం. ఏసీబీ విచారణ సందర్భంగా అధికారి ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. ఆయన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు ఆ తరువాత కేటీఆర్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ నిధులు ఇచ్చే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సైతం అమలులో ఉంది. అయినప్పటికీ నిధులు ఇవ్వడంపై ఈ వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ రెండూ కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News