గులాబీ తోటలో బావా మరుదుల పోటాపోటీ ?
మరో వైపు చూస్తే తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్ లో జరుగుతాయి అంటే మరో నాలుగేళ్ళ కాలం అన్న మాట.
బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్. ఆయన ఆ పార్టీకి కర్త కర్మ క్రియగా ఉంటారు. అయితే ఈ నెలలో వచ్చే పుట్టిన రోజుతో కేసీఅర్ వయసు 71 నిండి 72కి చేరుకుంటుంది. మరో వైపు చూస్తే తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్ లో జరుగుతాయి అంటే మరో నాలుగేళ్ళ కాలం అన్న మాట. అప్పటికి కేసీఅర్ వయసు 75 దాటుతుంది.
మరో వైపు కేసీఅర్ వారసులను ఆ ఎన్నికలకు ముందే నిర్ణయిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తీరుని గమనించిన వారికి ఎవరికైనా కేటీఆర్ ఆయన రాజకీయ వారసుడు అనిపిస్తుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. అలాగే ఆయనే అన్ని విషయాలూ చూసుకుంటున్నారు.
మరో వైపు పార్టీ పుట్టిన దగ్గర నుంచి మేనమామ వెంట నడిచిన వారు హరీష్ రావు. ఆయన కూడా బీఆర్ఎస్ కి పునాది లాంటి వారు ఒక విధంగా పార్టీలో కేటీఆర్ కంటే సీనియర్. రూరల్ బేస్ లో పట్టు ఉన్నావారు అని చెబుతారు. ఇలా ఇద్దరూ సమ ఉజ్జీలే. ఇద్దరూ కేసీఆర్ కి రెండు వైపులా ఉన్న వారే. మరి కేసీఆర్ ఓటు ఎవరికి అన్నది ఈ రోజుకు అయితే తెలియదు. ఎంతైనా పుత్ర ప్రేమ ఉంటుంది కాబట్టి కేటీఆర్ వైపు మొగ్గు చూపుతారా అన్న చర్చ కూడా ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ ఎస్ లో తాజాగా ఈ ఇద్దరి మధ్య పోటా పోటీ వాతావరణం కనిపిస్తోంది అని అంటున్నారు. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని అలా పార్టీ మీద పట్టుని పెంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. దానికి ఎన్నో ఉదాహరణలను ఉదంతాలను కూడా చెబుతున్నారు.
ఇటీవల పదవీకాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్లు వైఎస్ చైర్మన్లను బీఆర్ఎస్ అధినాయకత్వం సత్కరించింది. ఈ కర్యక్ర్మానికి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరూ వస్తారని అనుకున్నా చివరికి కేటీఅర్ ఒక్కరే వచ్చారు అని అంటున్నారు. అంతే కాదు తెలంగాణా రాష్ట్రంలో పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలను కూడా ఈ ఇద్దరు నేతలూ పోటా పోటీగా ఆవిష్కరించడమూ గులాబీ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది.
ఈ విధంగా బావా బావమరిదుల మధ్య ఏదో పోటీ ఉందని అది ఆధిపత్య పోరుకు దారి తీస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఈ ఇద్దరు నేతలూ ఐక్యంగా కనిపించినా ఇపుడు ఈ విధంగా వేరు పడి పోటీ పడి కార్యక్రమాలను నిర్వహించడం మంచిది కాదని అంటున్నారు.
ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటోందని కూడా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కి బలమైన నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అలాగే బీజేపీ కూడా తెలంగాణాలో పట్టు సాధించాలని చూస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ ని ఒక గాటికి త్రాటికి తీసుకుని వచ్చేందుకు అంతా కలసి కృషి చేయాల్సిన వేళ అగ్ర నేతలుగా ఉన్న వారే తలో దారీ పడితే ఎలా అన్నది కూడా చర్చగా ఉంది.
ఇంకో వైపు కేసీఅర్ కూడా పార్టీలో పరిణామాల పట్ల నిశిత పరిశీలన చేయాలని ఆయన అందరినీ ముందుకు నడిపించాలని అంటున్నారు .లేకపోతే వర్గ పోరు ముదిగి క్యాడర్ లో అయోమయం ఏర్పడి గులాబీ పార్టీయే చివరికి నష్టపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.