గులాబీ యువరాజు చంద్రబాబుగా మారాడా?

ఎంత మాటలు నేర్చిన చిలుక అయినప్పటికీ.. అసందర్భంగా మాట్లాడే మాటలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది.

Update: 2023-11-24 04:36 GMT

ఎంత మాటలు నేర్చిన చిలుక అయినప్పటికీ.. అసందర్భంగా మాట్లాడే మాటలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. దీనికి గులాబీ యువరాజు కేటీఆర్ సైతం మినహాయింపు కాదని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడా పార్టీకి తలనొప్పిగా మారాయంటున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు ఎప్పటికప్పుడు కొత్త చర్చగా మారటమే కాదు.. అహంకారానికి నిలువెత్తు రూపంగా గులాబీ యువరాజు మాటలు ఉన్నాయంటున్నారు.

ఏపీ విపక్ష నేత చంద్రబాబు జైలు ఎపిసోడ్ లో ఆయన స్పందించిన తీరు.. ఈ సందర్భంగా తనకు లోకేశ్ ఫోన్ చేశారంటూ చెప్పిన మాటలు మొదలు.. ప్రభుత్వం మీదా.. ఉద్యోగాల మీదా.. ప్రతిపక్షాల మీదా.. ఇలా ఆ విషయం.. ఈ విషయం అన్న తేడా లేకుండా ప్రతి విషయాన్ని టచ్ చేసిన కేటీఆర్ మాటలు ముఖం మొత్తేలా మారటమే కాదు.. ఆయన నోటికి కాస్త తాళం వేయిస్తే చాలన్న మాట గులాబీ నేతల నోటి నుంచే రావటం గమనార్హం.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో మాట్లాడే టాలెంట్ కేటీఆర్ కు ఉందని చెబుతారు. నిజానికి మరే రాజకీయ అధినేత కొడుక్కి లేని టాలెంట్ కేటీఆర్ సొంతమని.. ఆయన మాటలు పార్టీకి మేలు చేస్తాయన్న వాదన బలంగా వినిపించేది. అయితే.. అసందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఇప్పుడు తలనొప్పిగా మారటమే కాదు.. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ పార్టీకి వచ్చే సీట్ల లెక్కల మీదా ప్రభావాన్ని చూపించటం ఖాయమని చెబుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతల నోటి నుంచి వస్తున్న మాటలు ఆసక్తికరంగా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లో టైమింగ్ తో సంబంధం లేకుండా మాట్లడే నేతగా చంద్రబాబుకు పేరుంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదని.. ఆయన నోరు తెరిచి మాట్లాడితే చాలు.. పార్టీకి దెబ్బ పడుతుందని.. ఆయన చేత తక్కువ మాట్లాడించాలన్న విన్నపాలు వినిపిస్తుంటాయి. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు లేని లోటు కేటీఆర్ పుణ్యమా అని తీరిపోతుందని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఏదైనా షాక్ తగిలితే మాత్రం.. అందులో కేటీఆర్ వాటా చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆయన మాటలు పార్టీకి పెద్ద ఎత్తున చేటు చేస్తున్నాయన్న వాదన ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు గులాబీ నేతలైతే మీడియా ప్రతినిధులతో..మీకు పుణ్యం ఉంటుందని.. మా యువరాజు నోటికి తాళం వేయించండన్న విన్నపాలు చేసుకోవటం గమనార్హం.

Tags:    

Similar News