ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్... ‘జీరో అవర్ డ్రైవర్ లేని కారు’!
ఈ సందర్భంగా శనివారం ఏపీ అసెంబ్లీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ టీడీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
ప్రతిపక్షాలు లేకపోయినా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నంతలో వాడీ వేడిగానే సాగుతున్నాయి! దీంతో... విపక్షం లేని లోటును కూడా కూటమి పార్టీ నేతలే పంచుకుంటున్నారనే (సరదా) కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సందర్భంగా శనివారం ఏపీ అసెంబ్లీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ టీడీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
అవును... ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేకపోవడం, అంతా అధికార పక్షమే అయిపోవడంతో "స్వ డబ్బ, పర డబ్బా.. వెరసి పరస్పర డబ్బా"గా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్న వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... అసెంబ్లీలో జీరో అవర్ పై టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు!
ఇందులో భాగంగా... ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ సభ్యుడు కూన రవికుమార్ గళం విప్పారు. అసెంబ్లీ సమావేశాలో భాగంగా జరిగే జీరో అవర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు లేవనెత్తే సమస్యల గురించి ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు.
దీంతో... స్పీకర్ అయ్యన్నపాత్రుడు కల్పించుకుని స్పందించారు. సభలో మంత్రులు ఉన్నారని, వాళ్లు నోట్ చేసుకుంటున్నారని, నిండు సభలో అలా అసత్యాలు మాట్లాడకూడదని హితవు పలికారు. దీనికి స్పందించిన రవి.. 10 మంత్రులు ఉన్నారని, ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియడం లేదని, జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందని కామెంట్ చేశారు.
దీంతో... ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఇందులో భాగంగా... జీరో అవర్ లో సభ్యులు ప్రస్తావించే అంశాలన్నీ తాము నోట్ చేసుకుంటున్నామని.. అవన్నీ శాఖల వారీగా మంత్రుల దృష్టికి వస్తాయని.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామ్నే విషయాన్ని తిరిగి సదరు సభ్యుడికి తెలియజేస్తామని అన్నారు.
దీనిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అచ్చెన్నాయుడు అన్నారు. అనంతరం కూన రవికుమార్ మాట్లాడుతూ... మంత్రి నోట్ చేసుకున్న అంశాలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాధానాలు కనీసం అసెంబ్లీ సమావేశాల నాటికి తమకు తెలియజేసినా తృప్తిగా ఉంటుందని అన్నారు. ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది!