కర్నూలు కాంగ్రెస్ ఆఫీసు కబ్జా? షర్మిల సీరియస్!

నమ్ముకున్న పార్టీకే కొందరు కాంగ్రెస్ నేతలు సున్నం రాశారా? అంటే ఔననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2025-02-07 12:30 GMT

నమ్ముకున్న పార్టీకే కొందరు కాంగ్రెస్ నేతలు సున్నం రాశారా? అంటే ఔననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణపైనే వారు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అనుమతి లేకుండా ప్రైవేటు సొసైటీపై రిజిస్ట్రేషన్ చేయడమే వారి అనుమానాలకు కారణంగా చెబుతున్నారు.

కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెసులో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఎన్నికల అనంతరం ఆయనను కర్నూలు డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అయితే ఆయన తీరు ఇటీవల అనుమానస్పదంగా ఉండటంతో పార్టీ నేతలు ఓ కన్నేశారంటున్నారు. దీంతో సంచలన విషయాలు వెలుగుచూశాయని చెబుతున్నారు.

నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ కథనం ప్రకారం కర్నూలు డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ పార్టీ ఆస్తులకు తానే యజమానిగా ప్రకటించుకునేందుకు కుట్ర పన్నారట. పార్టీ ఆఫీసులో పనిచేసే అటెండర్ల, స్వీపర్లతో కలిపి ఓ సొసైటీ ఏర్పాటు చేసి కర్నూలు డీసీసీ భవన్ అయిన కళా వెంకటర్రావు భవనాన్ని కొట్టేయాలని ప్లాన్ చేసినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భవనంలో వాణిజ్య సముదాయాల నుంచి ప్రతి నెలా రూ.1.80 లక్షల ఆదాయం వస్తుంది. అదేవిధంగా 33 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న డీసీసీ భవనం ప్రస్తుత ధర దాదాపు రూ.16 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆస్తిపై కన్నేసిన మురళీకృష్ణ పార్టీకి సమాచారం ఇవ్వకుండా ఓ సొసైటీ పేరిట భవనాన్ని రిజిస్ట్రర్ చేయించారని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం ఆరోపిస్తోంది.

అయితే ఈ విషయం పార్టీ అధిష్టానం వరకు వెళ్లడంతో దీనిపై దర్యాప్తు చేయాలని పీసీసీ చీఫ్ షర్మిల మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును కర్నూలు పంపారు. ఆయన ఆరా తీయగా పార్టీ ఆస్తులను సొంతం చేసుకునేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని గుర్తించారని చెబుతున్నారు. దీనిపై నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ వాదన మాత్రం వేరేలా ఉంది. ఈకేవైసీ చేయించేందుకే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించానని, అనుమానాలు వ్యక్తం చేయడం వల్ల సొసైటీని రద్దు చేసుకున్నామని తెలిపారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుందని, కాంగ్రెస్ ఆస్తులు తనకు అవసరం లేదని వివరణ ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 14న జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం మేరకే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించామని వివరించారు.

Tags:    

Similar News