వేయి కిలోమీటర్ల బాకీ ఉన్న లోకేష్....!
నారా లోకేష్. టీడీపీలో చంద్రబాబు రాజకీయ వారసుడు. ఆయన ఈసారి ఎలాగైనా ఎలివేట్ కావాలని భావించి బృహత్తరమైన పాదయాత్ర చేపట్టారు
నారా లోకేష్. టీడీపీలో చంద్రబాబు రాజకీయ వారసుడు. ఆయన ఈసారి ఎలాగైనా ఎలివేట్ కావాలని భావించి బృహత్తరమైన పాదయాత్ర చేపట్టారు. వైఎస్ జగన్ చేసిన మూడు వేల ఏడు వందల పై చిలుకు పాదయాత్ర రికార్డుని బద్ధలు కొట్టడమే కాకుండా పాదయాత్ర సెంటిమెంట్ ని వాడుకుని టీడీపీని అధికారంలోకి తీసుకుని రావాలని తపించారు.
వైఎస్సార్ పాదయాత్ర చేస్తే సీఎం అయ్యారు. చంద్రబాబు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక జగన్ సైతం పాదయాత్రతోనే ముఖ్యమంత్రి అయ్యారు. మరి లోకేష్ ఈ సెంటిమెంట్ ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న వేళ అనుకోని అవాంతరంలా చంద్రబాబు అరెస్ట్ టీడీపీని కుదిపేసింది. దాంతో సెప్టెంబర్ 10న పశ్చిమ గోదావరి జిల్లా రాజోలు వద్ద ఆయన పాదయాత్ర హఠాత్తుగా నిలిచి పోయింది.
ఇప్పటికి రెండు నెలలు పై దాటింది మళ్ళీ పాదయాత్ర ఊసు లేదు. అంతే కాదు అసలు లోకేష్ ఏమి చేస్తున్నారో ఎవరికి తెలియడంలేదు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చి కూడా ఇరవై రోజులకు దగ్గర పడుతోంది. పార్టీని జనంలో పెట్టాలని లోకేష్ ఎందుకు ఆలోచించడంలేదు అని అంటున్న వారు ఉన్నారు.
ఇదిలా ఉంటే పాదయాత్ర లోకేష్ ప్రారంభించాలని ఉందా లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర ఈ రోజుతో మొదలెడితే కచ్చితంగా వంద రోజుల పాటు ఏకబిగిన నడవాలి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాతో తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో ఉమ్మడి మూడు జిల్లాలను దాటుకుని ఇచ్చాపురం దాకా నడవాలి. వేయి కిలోమీటర్ల పైబడి పాదయాత్ర బాకీ ఉంది.
ఈ పాదయాత్ర పూర్తి కావడానికి మూడు నెలలు పైన పడుతుంది అని అంటున్నారు. అంటే ఎలా చూసుకున్నా ఈ రోజు నుంచి మొదలెడితే మార్చి దాకా సాగుతుంది. మరి టీడీపీ ఎన్నికల ప్రచారం ఎపుడు ఉంటుంది, అలాగే లోకేష్ తన సొంత సీటులో ప్రచారం చేస్తూ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి ఉంది.
దీంతో లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించడం ఉంటుందా లేదా అన్న చర్చ అయితే పార్టీలో సాగుతోంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వస్తే ఆయన పార్టీ బాధ్యతలు చూసుకుంటారు అపుడు వెసులుబాటు కలుగుతుంది. కానీ పాదయాత్ర అపుడు కూడా పూర్తి చేయడానికి సమయం సరిపోదు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే లోకేష్ పాదయాత్ర ఉండాలీ అంటే నవంబర్ నెల కీలకం అని అంటున్నారు. సుప్రీం కోర్టు లో రిజర్వు లో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు వెలువడాలి. అలాగే హై కోర్టు రిజర్వ్ చేసినా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద అనుకూలమైన తీర్పు రావాలి. అవి ఈ నెలలో జరిగితేనే లోకేష్ పాదయాత్ర ఉంటుంది అని అనుకోవాలి.
లేకపోతే పాదయాత్ర అన్నది ముగిసినట్లే అని అంటున్నారు. ఎందుకంటే ఆ తరువాత చంద్రబాబుకు కోర్టుల పరంగా రిలీఫ్ వచ్చినా ఎన్నికల ముంగిటకు వచ్చేస్తారు కాబట్టి ఇక పాదాలు కదపడం అన్నది అసాధ్యం అని అంటున్నారు. మొత్తానికి ఈ నెలాఖరు వరకూ లోకేష్ నుంచి పార్టీ యాక్టివిటీస్ కూడా పెద్దగా ఆశించడం జరగదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.