వారం రోజుల్లోనే బట్టతల... ఆందోళనలో మూడు గ్రామాల ప్రజలు!

అయితే... తాజాగా ఓ జిల్లాలోని గ్రామాల్లో ప్రతీ రోజూ గుప్పెడు గుప్పెడు వెంట్రుకలు ఊడిపోవడం మొదలయ్యింది.

Update: 2025-01-08 19:30 GMT

బట్టతల అనేది ఎంత తీవ్రమైన సమస్య, ఎంత పెద్ద ఇబ్బంది అనేది అది ఉన్నవారికే తెలుస్తుంది అని అంటారు. వయసులో ఉన్నప్పుడు పాకెట్ లో దువ్వెన లేకుండా బయటకు వెళ్లని వారు.. కాల క్రమంలో అసలు దువ్వెన అవసరమే లేని పరిస్థితికి వచ్చేస్తుంటారు. ఇక పెళ్లికాని యువకులకు బట్టతల వస్తే ఆ బాధ వర్ణణాతీతం అని చెబుతుంటారు.

ఎంత టెక్నాలజీ వచ్చి తలపై వెంట్రుకలు అతికించుకున్నా, మొలిపించుకున్నా.. ఒరిజినల్ ఒరిజినలే అనేవారూ లేకపోలేదు. అందుకే సాధారణంగా చాలా మంది పురుషులు ఒక్కసారిగా నాలుగు వెంట్రుకలు ఊడేసరికి బెంగ పెట్టేసుకుంటారు! అయితే... తాజాగా ఓ జిల్లాలోని గ్రామాల్లో ప్రతీ రోజూ గుప్పెడు గుప్పెడు వెంట్రుకలు ఊడిపోవడం మొదలయ్యింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ భారీ జుట్టు ఉన్నవారు సైతం.. రోజుల వ్యవధిలో తల వెంట్రుకలు లేకుండా దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో... వారం రోజుల్లోనే అక్కడి ప్రజలకు బట్టతల వచ్చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఆ వివరాలేమిటి.. ఆ గ్రామ ప్రజలకు వచ్చిన సమస్య ఏమిటి.. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం!

అవును... మహారాష్ట్రలోని బుల్దనా జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. ఆ జిల్లాలోని మూడు గ్రామాల్లోని ప్రజలకు హఠాత్తుగా జుట్టు రాలడం మొదలైంది. అదేముంది.. ఈ రోజుల్లో సహజం కదా అని లైట్ తీసుకునే స్థాయిలో కాదు! గత కొన్ని రోజులుగా విపరీతంగా ఊడుతోంది. ఆ దెబ్బకు వారం రోజుల్లోనే బట్టతల వచ్చేసిన పరిస్థితి!

ఇలా సామూహికంగా ఆ మూడు గ్రామాల్లోని ప్రజలందరికీ ఒకేసారి ఈ స్థాయిలో జుట్టు రాలుతుండటంపై గ్రామంలో భయం నెలకొంది. దీంతో.. ఈ విషయం ప్రభుత్వ అధికారుల వద్దకు చేరింది. ఈ సందర్భంగా విపరీతంగా జుట్టు రాలిపోయిన ఆ ప్రజలను పరీక్షించిన అనంతరం వీరి సమస్యకు కారణం నీటి కాలుష్యమే అధికారులు అనుమానించారు.

దీంతో.. అక్కడున్న నీటి శాంపిప్స్ తో పాటు గ్రామస్థుల జుట్టు, చర్మ నమూనాలను పరీక్షలకోసం ఆరోగ్యశాఖ అధికారులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన షెగావ్ ఆరోగ్య అధికారి డాక్టర్ దీపాలి రహేకర్ మాట్లాడుతూ... ఈ పరిస్థితికి కారణం కలుషితమైన నీరు కావొచ్చని.. ఆ నీటి శాంపిల్స్ ని పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

Tags:    

Similar News