లోకేష్ ని ఇక ఆపేది ఎవరు ?

అదే తన తండ్రి అధిరోహించిన ఆ పీఠం వైపుగా సాగడమే ఆ గమ్యం.

Update: 2025-01-09 07:43 GMT

నారా లోకేష్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తండ్రి దిగ్గజ నాయకుడు జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న మహా నేత. లోకేష్ కేరాఫ్ చంద్రబాబు అన్న దాని నుంచి మంత్రిగా లోకేష్ తన రాణింపుతో స్థాయి పెంచుకున్నారు. ఇపుడు ఆయన మరింతగా ఎదుగుతున్నారు. ఆ ఎదుగుదలకు ఒక గమ్యం ఉంది. అదే తన తండ్రి అధిరోహించిన ఆ పీఠం వైపుగా సాగడమే ఆ గమ్యం. అందుకోసం ఒక భారీ లక్ష్యం ఉంది.

లోకేష్ లక్ష్యం గురి అయితే తప్పడం లేదు. పైగా జోరందుకుంది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ సభలో పవన్ కళ్యాణ్ హైలెట్ అవుతారు అని అంతా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ నిండుగా సినీ గ్లామర్ ఉన్న వారు పైగా రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో ఉన్న వారు మోడీ మెచ్చిన వారు బాబుకు బాగా నచ్చుతున్న వారు కాబట్టి ఆయనే కచ్చితంగా ముఖ్య ఆకర్షణ అనుకున్నారు. అలాగే పవన్ ఒక ఆకర్షణగా ఉన్నారు.

కానీ అనూహ్యంగా నారా లోకేష్ హైలెట్ అయ్యారు. ఎంతలా అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు కుటుంబంతో సహా ఒక సారి ఢిల్లీ వచ్చి తనను కలవమని కోరినంతగా. అంతే కాదు నారా లోకేష్ ప్రసంగం చేస్తూ ఉంటే మోడీ ఎన్నడూ లేనిది ఆసక్తిగా విన్నారు. పదే పదే నమో అంటూ లోకేష్ మంత్రం చెబుతూంటే దానికి మంత్ర ముగ్దుడైనట్లుగా ప్రధాని మోడీ కనిపించారు.

టీడీపీలో చంద్రబాబుతో మోడీ దోస్తీ పాతది. ఆయన గురించి బాగా తెలుసు. కానీ విశాఖ సభలో మాత్రం మోడీకి అర్థమైంది తెలిసింది మరోటి ఉంది. అదే టీడీపీకి బలమైన భావి వారసుడు సిద్ధంగా ఉన్నారు అని. మోడీ సైతం లోకేష్ పట్ల వాత్సల్యం చూపించారు కాబట్టి ఆయనకు ఆశీస్సులు అందించినట్లే అనుకోవాలి.

ఇక లోకేష్ గురించి చెప్పుకుంటే టీడీపీ సింగిల్ గా ఏపీలో ప్రభుత్వం స్థాపిస్తే ఆయనే ఉప ముఖ్యమంత్రి. ఇందులో ఎవరికీ ఏ రకమైన డౌట్లూ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజుకీ టీడీపీకి సొంతంగా బలం ఉంది. 135 దాకా సీట్లు ఉన్నాయి. కానీ పొత్తు ధర్మంతో జనసేన బీజేపీలతో కలసి కూటమిని ఏర్పాటు చేసింది.

అలా కూటమి పక్షాన రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. పవన్ ఆ పదవిలో కుదురుకున్నారు. ఇక చంద్రబాబుతో సరిసమాన హోదాతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు నిండిపోయాయి. అటు బాబు ఇటు పవన్ తప్ప మూడవ పేరు వినిపించడం లేదు. కానీ లోకేష్ ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. అది జన ముఖంగా తెలియాలీ అంటే ఆయన ఇమేజ్ ని పెంచాలీ అంటే ఏమి చేయాలో అవన్నీ చేయమని ఎటువంటి శషబిషలు పెట్టుకోవద్దు అంటూ టీడీపీ అనుకూల మీద ఒక వైపు ఊదరగొడుతోంది. టీడీపీ అధినాయకత్వాన్ని అలెర్ట్ చేస్తోంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే 2029 నాటికి జగన్ పవన్ తో సరిసమానంగా ఇమేజ్ లోకేష్ కి దక్కదని కూడా హెచ్చరిస్తోంది. అందుకేనేమో అన్నట్లుగా ప్రధాని సభలో లోకేష్ ని ముందు పెట్టి హైలెట్ చేశారు. ఇక ఫ్లెక్సీలలో ఎక్కడ చూసినా బాబు పవన్ తో పాటు లోకేష్ కి ప్రాధాన్యత ఇచ్చారు.

ఇక ఇవ్వాల్సింది చేయాల్సింది ఒకటి మిగిలి ఉంది అదేంటి అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం. అది కనుక ఇస్తే ఇలా అడపా తడపా జరిగే ప్రధాని స్థాయి పెద్దల స్థాయి సభలలో హైలెట్ కావడం కంటే పర్మినెంట్ గా ప్రతీ రోజూ హైలెట్ కావచ్చు. అంతే కాదు బాబు వారసుడు లోకేష్ బాబు అన్నది సాదర జనానికి కూడా అర్థమయ్యేలా మెసేజ్ ని కూడా పంపించవచ్చు.

ఈ విషయం టీడీపీ పెద్దలకు తెలియదా అంటే తెలుసు. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఒక వ్యూహం ప్రకారమే అనుకోవాలి. ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఇస్తేనే తాను తీసుకుంటాను అని పవన్ కండిషన్ పెట్టారు అని ఒక వార్త అప్పట్లో ప్రచారం అయితే సాగింది. అదెంత వరకూ నిజమో తెలియదు. అయినా సరే లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేద్దామని అనుకుంటే ఆపేదెవరు అన్న ప్రశ్న ఉండనే ఉంది.

ఇక కొత్త తెలుగు సంవత్సరం ఉగాది తరువాత ఏపీ మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని అంటున్నారు. నాగబాబు మంత్రిగా ప్రమాణం చేస్తారు అన్నది ఖాయమైన వేళ శాఖల్లో సైతం మార్పులు అంటూ ప్రచారం సాగుతోంది. ఇదే సందర్భంలో లోకేష్ కి పదోన్నతి ఇచ్చి డిప్యూటీ సీఎం చేస్తారు అంటూ కొత్త ప్రచారం అయితే ఊపందుకుంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత వరకూ ఉందో.

Tags:    

Similar News