ఢిల్లీ కి ఏమాత్రం తగ్గకుండా... ఏపీ లిక్కర్ స్కామ్ లో షాకింగ్ విషయాలు!
గత ప్రభుత్వ హయాంలో ఏపీలోని లిక్కర్ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించిన వేళ.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.;
దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో సంచలనంగా మారిందనే సంగతి తెలిసిందే. కేసు హస్తినలో అయినా.. దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర షాకింగ్ పరిణామాలను తెరపైకి తెచ్చింది. ఈ సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతోన్న ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా హస్తిన స్కామ్ కు ఏమాత్రం తగ్గేలా లేదనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... గత ప్రభుత్వ హయాంలో ఏపీలోని లిక్కర్ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించిన వేళ.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. వైసీపీ మద్యం విధానం వల్ల రాష్ట్రానికి సుమారు రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఇదే సమయంలో సిట్ ని ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా... లిక్కర్ పాలసీ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో మరో ఆరుగురు సభ్యులతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ సమయంలో పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపాయి.
వాస్తవానికి జగన్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించేందుకు అంగీకరించినవారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటి బాధ్యతలు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్వహించేవారనే ఆరోపణలు బలంగా వినిపించేవని అంటారు. ఈ మేరకు సీఐడీ, సిట్ దర్యాప్తుల్లోనూ దీనికి సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందిస్తూ... లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేల్చి చెప్పేసిన పరిస్థితి అనే చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... లిక్కర్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగిందనే విషయాన్ని సాయిరెడ్డి చెప్పకనే చెప్పారనే చర్చ బలంగా మొదలైందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి అసెంబ్లీలో వివరించారు!
బడ్జెట్ పద్దులపై చర్చకు సమాధానం ఇచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర... దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని.. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నరని.. దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు. మద్యంపై వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని 2033 వారకూ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. మధ్యం ధరల్ని 150 శాతం పెంచారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి విషయాన్ని ప్రస్థావించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇందులో భాగంగా.. గత ప్రభుత్వంలో ఎలా వసూలు చేశారో.. అవి బాస్ కు ఎలా అందజేశారో.. ఏ1 అయిన ఆనాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే ఏ2 స్పష్టంగా చెప్పారని వివరించారు. దీంతో.. ఏపీ లిక్కర్ స్కామ్ పెను సంచలనాలు సృష్టించే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది.